స్మిషింగ్‌తో ఖాతాలు లూటీ
eenadu telugu news
Updated : 27/07/2021 11:59 IST

స్మిషింగ్‌తో ఖాతాలు లూటీ

సంక్షిప్త సందేశాల్లో లింకులు పంపుతూ బురిడీ

దర్యాప్తు అధికారులకు దొరక్కుండా ఎత్తులు

ఐపీ చిరునామాలు కనబడకుండా జాగ్రత్తలు

ఈనాడు - అమరావతి

బ్యాంకులు తమ వినియోగదారులకు కలిపిస్తున్న వెసులుబాట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్‌ మోసగాళ్లు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకు దొరక్కుండా నేరాలకు పాల్పడుతూ ఖాతాల నుంచి సొమ్మును దోచుకుంటున్నారు. వీరి ఎత్తుగడలను పసిగట్టలేక పలువురు తమ కష్టార్జితాన్ని పొగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో నగర కమిషనరేట్‌ పరిధిలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. స్మిషింగ్‌ ద్వారా ఎంచుకున్న వ్యక్తికి నకిలీ లింకును ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపించి ఎర వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.

ఎస్సెమ్మెస్‌ క్లిక్‌ చేస్తే..

రూ. 30 వేలు పోయాయి.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి గత వారం ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. మీ బ్యాంకు ఖాతాను నిలిపివేశామని, త్వరగా పునరద్ధరించుకోవాలని, దీనికి ఈ లింక్‌ను క్లిక్‌ చేయాలని ఉంది. ఇది బ్యాంకు నుంచి వచ్చిందే అని నమ్మి.. రెన్యువల్‌ కోసం క్లిక్‌ చేశారు. ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ పేజీ కనిపించింది. అందులో ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యారు. వెంటనే మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. దీనిని ఎంటర్‌ చేయగానే రూ. 20 వేలు పోయాయి. రెండో సారి వచ్చిన ఓటీపీని నమోదు చేయగానే మరో రూ. 10 వేలు మాయమయ్యాయి. ఏమైందో తెలుసుకునే లోపలే రూ. ఖాతా నుంచి రూ. 30 వేలు పోయాయి.


ఆధారాలు దొరక్కుండా

సైబర్‌ నేరాల్లో ఐపీ చిరునామా ద్వారా పోలీసులు నిందితులను పట్టుకుంటారు. కానీ ఇది దొరక్కుండా మోసగాళ్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాలకు చెందిన ఎన్జీరాక్స్‌ అనే సర్వర్‌ను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ సర్వర్‌ ద్వారా తమ కంప్యూటర్‌లోనే హోస్ట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. నేరం చేసిన వెంటనే ఐపీ చిరునామాను దాస్తున్నారు. ఇది దర్యాప్తు అధికారులకు సవాలుగా మారుతోంది. దీనిని ట్రాక్‌ చేయాలంటే కష్టంగా మారుతోంది. ఈ పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు.


జాగ్రత్తలు తప్పనిసరి

* బ్యాంకుల పేరుతో సంక్షిప్త సందేశాలు వస్తే.. గుడ్డిగా అందులోని లింకులను క్లిక్‌ చేయొద్ధు హైపర్‌లింక్‌ను టైప్‌ చేసి మాత్రమే తెరవాలి. ఎవరి నుంచి వచ్చిందో కూడా పరిశీలించాలి. ఏదైనా మొబైల్‌ నెంబరు నుంచి వస్తే నమ్మాల్సిన పని లేదు. ఎస్పీఏ సెంటర్‌ ఐడీ నుంచి వస్తే ఇబ్బంది లేదు.

* కొన్ని సార్లు నకిలీ ఐడీలను కూడా తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌లను పంపిస్తున్నారు. ఈ విషయంలో జాగురూకతతో ఉండాలి.

* ఆర్థిక లావాదేవీల సమయంలో కేవలం సంబంధిత బ్యాంకు సైట్‌ యూఆర్‌ఎల్‌ను మాత్రమే టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. ఇది సురక్షితమైన పద్ధతి.


హ్యాకర్ల చేతికి నియంత్రణ

* డబ్బును వేరొకరికి బదిలీ చేయాలంటే.. సంబంధిత ఖాతా నెంబరును అనుసంధానం చేసుకోవాలి. ఇది అవసరం లేకుండానే పలు బ్యాంకులు ఒక్కో లావాదేవీలో రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు వరకు పంపించుకునే వెసులుబాటును ఇస్తున్నాయి. దీనిని స్మిషింగ్‌కు పాల్పడేందుకు ఉపయోగించుకుంటున్నారు సైబర్‌ కేటుగాళ్లు. ఇందుకు గాను పలు కారణాలు చూపుతూ ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తున్నారు. ‘మీ బ్యాంకు ఖాతాకు పాన్‌ నెంబరును అనుసంధానం చేసుకోండి..’, ‘మీ ఖాతా బ్లాక్‌ అయింది, ఈ లింక్‌ ద్వారా సరిచూసుకోండి..’, ‘మీ బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీ జరిగింది. ఓ సారి చెక్‌ చేసుకోండి’ అంటూ సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. అందులో నకిలీ లింకులు కూడా జోడిస్తున్నారు. వాటిని క్లిక్‌ చేయగానే హ్యాకర్లు రూపొందించిన సంబంధిత బ్యాంకు నకిలీ పేజీ కనిపిస్తుంది. వివరాలు నమోదు చేయగానే.. ఇక నియంత్రణ అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

* నకిలీ పేజీలో నమోదు చేసే వివరాలను.. హ్యాకర్లు మరో వైపు అసలైన పేజీ తెరిచి అందులో ఎంటర్‌ చేస్తారు. ఓటీపీని కూడా ఇలాగే బాధితుడు నకిలీ పేజీలో నమోదు చేయగానే, దాన్ని అసలు దాంట్లో ఎంటర్‌ చేసి లావాదేవీలు చేస్తారు. వారి బ్యాంకు ఖాతా నుంచి సొమ్మును బదిలీ చేసుకుంటారు.


అపరిచిత లింకులను పట్టించుకోవద్దు

- సాయి సతీష్‌, సైబర్‌ నిపుణుడు

మోసగాళ్లు పంపించే సందేశాలను పట్టించుకోవద్ధు ఏవైనా అనుమానాలు ఉంటే.. సంబంధిత బ్యాంకరుకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలి. ఎన్జీరాక్స్‌ సంస్థ సేవలను భారతదేశంలోనూ వినియోగించుకుంటున్నందున, కేంద్ర ప్రభుత్వం దీనిపై నియంత్రణ పెంచాలి. ఈ సంస్థ కూడా భారత్‌లో నోడల్‌ అధికారిని నియమించేలా చూడాలి. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మిషింగ్‌ ద్వారా దాదాపు 2.40 లక్షల మంది ఖాతాల నుంచి రూ. కోట్లలో సొమ్మును దోచుకున్నట్లు తేలింది. అపరిచిత లింకులను క్లిక్‌ చేయకపోవడం మంచిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని