జాప్యం లేకుండా పుస్తకాల పంపిణీ
eenadu telugu news
Published : 27/07/2021 05:34 IST

జాప్యం లేకుండా పుస్తకాల పంపిణీ


విజయవాడలోని ప్రధాన కేంద్రంలో పుస్తకాలను పరిశీలిస్తున్న డీఈవో తహేరా సుల్తానా

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలోని 3173 ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్య పుస్తకాల్లో చాలావరకు వచ్చేశాయి. విజయవాడ ఆటోనగర్‌లోని గోదాము నుంచి జిల్లాలోని 50 మండలాల ఎంఈవో కార్యాలయాలకు పుస్తకాలను చేర్చే ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత ఏడాది పుస్తకాల పంపిణీ సక్రమంగా జరగలేదనే విమర్శల నేపథ్యంలో ఈ ఏడాది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి తహేరా సుల్తానా ‘ఈనాడు’కు తెలిపారు. ఆమె మాటల్లోనే..

ఎంఈవో కేంద్రాలకు 99శాతం.. జిల్లాకు ఇప్పటివరకు 22,79,138 పుస్తకాలు వచ్చాయి. వాటిలో 99శాతం ప్రధాన పుస్తక కేంద్రం నుంచి ఎంఈవో కార్యాలయాలకు చేర్చాం. వాటిలో ఎంఈవోలు 18.95 లక్షల పుస్తకాలను అందుకున్నట్టు ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగతా పుస్తకాలు ఎంఈవో కేంద్రాలకు ఇప్పటికే చేరాయి. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.

పాఠశాలలకు 44శాతం.. జిల్లాలో ఉన్న పాఠశాలలకు పుస్తకాలను చేర్చే ప్రక్రియ సగం వరకు పూర్తయింది. ఎంఈవో కేంద్రాలకు చేరిన పుస్తకాల్లో.. 44శాతం ఇప్పటివరకు పాఠశాలలకు చేర్చారు. ఎంఈవోలు 10.08లక్షల పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేసినట్టు నమోదు చేశారు. వాటిలో.. ప్రధానోపాధ్యాయులు 1,45,321 అందుకున్నట్టు ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

9, 10వ తరగతికి ముందుగా.. ముందుగా 9, 10 తరగతుల పిల్లలకు అందజేయనున్నాం. భద్రపరిచేందుకు అవకాశం ఉన్న పాఠశాలలన్నింటికీ ముందుగా చేర్చడం జరుగుతోంది. పాఠశాలలు తెరిచిన వెంటనే పిల్లలకు పుస్తకాలు ఒకేసారి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

రోజువారీ పర్యవేక్షణ.. పాఠశాలలకు ఎంతమేరకు చేరుస్తున్నారనేది రోజు వారీ టెలీకాన్ఫరెన్స్‌లో పర్యవేక్షణ చేస్తున్నాం. ముందుగానే పుస్తకాలు ఎక్కడెక్కడికి రానున్నాయనేది సమాచారం ఇచ్చి, భద్రపరచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

పుస్తకాలను షెడ్యూల్‌ ప్రకారం.. సెమిస్టర్ల వారీగా, వర్కు బుక్స్‌ కూడా ఈసారి ఉండడంతో ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలి. ఆరు, ఏడు వారికి ఏడాదికి రెండుసార్లు, చిన్న తరగతుల పిల్లలకు మూడుసార్లు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ముందుగానే షెడ్యూల్‌ను రూపొందించి.. దాని ప్రకారం పంపిణీ చేస్తాం. పుస్తకాలను ఆర్టీసీ సహకారంతో అన్ని మండలాలకు చేరుస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని