పెట్టుబడి 98 కోట్లు.. ఆదాయం 285 కోట్లు..
eenadu telugu news
Published : 27/07/2021 05:34 IST

పెట్టుబడి 98 కోట్లు.. ఆదాయం 285 కోట్లు..

ఈనాడు, అమరావతి

ప్రకాశం బ్యారేజీలో ఇసుక తవ్వకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. టెండర్లు ఖరారు చేసి మూడు నెలలు దాటినా.. ఇసుక తవ్వకాలపై ఉన్నత స్థాయిలో ఇంకా నిర్ణయానికి రాలేదు.. తవ్విన ఇసుకను ఎవరు అమ్మాలన్నది చర్చనీయాంశంగా మారింది. టెండర్లు దక్కించుకున్న గుత్త సంస్థలతో ఏపీఎండీసీ, జలవనరుల శాఖ చర్చిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు ఒకే గుత్త సంస్థకు అప్పగించిన నేపథ్యంలో బ్యారేజీ నుంచి వెలికి తీసిన ఇసుకను సైతం ఆ సంస్థకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జలాశయంలో డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక తవ్వకాలు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో నదిలో డ్రెడ్జింగ్‌ ప్రారంభించేందుకు గుత్త సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.

బ్యారేజీలో మొత్తం 1.20 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించింది. బాథోమెట్రిక్‌ సర్వే ద్వారా ఆల్ట్రాసౌండ్‌ పరికరం జలాశయంలోకి పంపి చిత్రాలు తీయడం ద్వారా వీటిని గుర్తిస్తారు. ఈసర్వే తాజాగా నిర్వహించలేదు. ఇటీవల వరదలు రాకముందే నిర్వహించారు. ఇటీవల కాలం బ్యారేజీలోకి భారీగా వాగుల నుంచి వరద చేరింది. దీంతో ఇసుక మేటలు అత్యధికంగా ఏర్పాటయ్యాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 50శాతం మేటల్లో ఉన్న ఇసుకను వెలికి తీయాలని నిర్ణయించి 60లక్షల ఘనపు మీటర్ల తవ్వకాలకు టెండర్లను పిలిచారు. ఇవి మొత్తం 12 ప్రాంతాల్లో (రీచ్‌లు) ఉన్నట్లు వెల్లడించారు. 12 ప్రాంతాల్లో వెలికి తీసేందుకు అంచనా వ్యయం రూ. 98కోట్లు. ఒక్క రీచ్‌ రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు విలువ ఉంటుంది. మొత్తం 12 టెండర్లు దాఖలు అయ్యాయి. వీటిలో రివర్స్‌ టెండరింగ్‌కు అవకాశం ఇచ్చారు. కోల్‌కతాకు చెందిన రీచ్‌డ్రెడ్జింగ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ మొత్తం 7 రీచ్‌లకు టెండర్లను దాఖలు చేసింది. 31శాతం తక్కువ ధరకు రివర్స్‌ టెండరింగ్‌ చేసింది. ఏడు రీచ్‌లు ఈ సంస్థకే దక్కనున్నాయి. మిగిలిన 5 టెండర్లకు స్థానిక సంస్థలు టెండర్లు వేశాయి. 25శాతం రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధర కోట్‌ చేశాయి. గుత్త సంస్థలతో జలవనరుల శాఖ ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. వెలికి తీసిన ఇసుకపై హక్కు ఎవరిదనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.

ఆ సంస్థకేనా..?

ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే గుత్త సంస్థ (జేపీ)కు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే సంస్థ విక్రయాలు చేపట్టింది. ఈ ప్రకారం బ్యారేజీ ద్వారా వచ్చిన ఇసుకపై తమకే హక్కు ఉంటుందనే వాదన తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. డ్రెడ్జింగ్‌ టెండర్లను జలవనరుల శాఖ చేపట్టింది. దీనికి పెట్టుబడి ఏపీఎండీసీ పెట్టనుంది. జేసీ సంస్థ ఒక టన్ను రూ.475గా ధర ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం బ్యారేజీ నుంచి సుమారు 60లక్షల టన్నులు ఇసుక వెలికి తీయనున్నారు. వీటి అమ్మకాల ద్వారా రూ.285 కోట్లు ఆదాయం వస్తుంది. రవాణా కాకుండానే ఈ ఆదాయం వస్తుంది. టెండర్ల వ్యయం మాత్రం సుమారు రూ.98 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రూ.187 కోట్లు అధిక ఆదాయం వస్తుంది. అయాచితంగా లభించే ఈ ఆదాయాన్ని వదులుకునేందుకు గుత్త సంస్థ సిద్ధంగా లేదని తెలిసింది. డ్రెడ్జింగ్‌ టెండర్లపై చర్చలు జరుగుతున్నాయని జలవనరుల శాఖ ఎస్‌ఈ మురళీకృష్ణారెడ్డి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని