వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఉమాపై దాడి: చంద్రబాబు
eenadu telugu news
Updated : 28/07/2021 13:43 IST

వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఉమాపై దాడి: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రోద్బలంతోనే వైకాపా గూండాలు దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా అవినీతి, అరాచకాలకు చక్రవడ్డీతో సహా మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు. బాధ్యులపై హత్యాయత్నం కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మైనింగ్‌ వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని కారుపై వందమంది దాడికి పాల్పడటం పిరికిపంద చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైకాపా నేతల్ని తెదేపా నేతలు అడ్డుకుంటే హత్యాయత్నాలు, బెదిరింపులకు దిగుతారా అని నిలదీశారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ

దేవినేని ఉమాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  ఓ వర్గం పోలీసులు వైకాపాతో కుమ్మక్కై అసమ్మతి స్వరాన్ని  అరెస్టులు, బెదిరింపులతో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమాపై దాడే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాఫియా, గూండాలు, చట్టవిరుద్ధ చర్యలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం దేవినేని ఉమా కొండపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తే... వైకాపా గూండాలు చేసిన దాడిలో పలువురు గాయపడగా, ఉమా కారు ధ్వంసమైందని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని అరెస్టు చేయాలన్న చంద్రబాబు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే దిశగా పోలీస్‌ అధిపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని