కృష్ణమ్మ పరవళ్లు
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

కృష్ణమ్మ పరవళ్లు

నాగార్జునసాగర్‌కు మొదలైన వరద

శ్రీశైలం నుంచి బిరబిర పరుగులు

ఈనాడు, గుంటూరు

కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో వరద పోటెత్తుతోంది. తుంగభధ్ర, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండటంతో గరిష్ఠ నీటిమట్టానికి చేరువైంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండటంతో ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేసింది. ఈ నీరు సాగర్‌ చేరడంతో క్రమంగా నీటిమట్టం పెరిగింది. బుధవారం ఇన్‌ఫ్లో 66375 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసినందున సాగర్‌ చేరే వరద జలాల పరిమాణం పెరగనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే నాగార్జునసాగర్‌ జలాశయం నిండనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నందున సాగర్‌ నిండి గేట్లు ఎత్తి విడుదల చేసే పరిస్థితి వస్తుందని జలవనరులశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు.

అన్నదాతల్లో ఆనందం

జులై నెలలోనే డ్యామ్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరుతుండటంతో ఆయకట్టు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌ కుడికాలువ కింద గుంటూరు జిల్లాలో బోరుబావులు, నీటివసతి ఉన్నచోట రైతులు ఇప్పటికే నారుమళ్లు సాగు చేస్తున్నారు. కాలువలకు నీటిని ఆగస్టు నెలలో విడుదల చేసిన వెంటనే నాట్లు వేసుకునే ప్రణాళికతో సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయకట్టుకు ఈఏడాది సకాలంలో సాగునీరు అందించే వెసులుబాటు కలిగింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టుకు నీటి కొరత ఉండదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. సాగర్‌ ఎడమ కాలువ కింద తెలంగాణతోపాటు ఏపీలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఆయకట్టు ఉంది. సాగర్‌లో నీటిలభ్యత పెరుగుతున్నందున రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేసే వెసులుబాటు కలిగింది.

వాణిజ్య పంటలకు అనుకూలం

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగర్‌ కాలువల కింద మిర్చి, పత్తి ప్రధాన వాణిజ్యపంటలు. రైతులు మిర్చి నారు పోసుకుని త్వరలో నాట్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈక్రమంలో ఆగస్టు తొలివారంలో కాలువలకు నీటిని విడుదల చేస్తే మిర్చి నాట్లు సకాలంలో వేసుకుంటారు. సాగునీరుపై భరోసా లభించడంతో రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. సాగర్‌ కాలువల కింద సాగు మొదలైతే అన్నదాతలకు పంటలు పండటంతోపాటు కూలీలకు ఆరు నెలలపాటు ఉపాధికి డోకా ఉండదు. ఈఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా సకాలంలో సాగునీరు వచ్చి వాతావరణం అనుకూలిస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్న ఆశతో రైతులు ఉన్నారు. దీంతో కాలువల కింద కౌలు మొత్తం పెరిగినా సాగుకు వెనుకాడటం లేదు. అటు ప్రకాశం జిల్లాలో సాగర్‌ కాలువల కింద ఆయకట్టుకు ఏటా ఆగస్టు నెల చివరలో నీటిని విడుదల చేసేవారు. ఈఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని