సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 29/07/2021 05:55 IST

సంక్షిప్త వార్తలు

నగరంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) బుధవారం జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ జె.నివాస్‌ పాల్గొన్నారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. పోలీసుల కవాతు అనంతరం సీఎం జగన్‌ ప్రజలను ఉద్దేసించి ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. వేడుకలకు ఒక రోజు ముందు నుంచి నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో, ప్రధాన రహదారులను పూల మొక్కలతో అలంకరించాలన్నారు. శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డిని, పోలీసు అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలని వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ను, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ను సీఎస్‌ ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేడుకల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


37 మంది వైద్యాధికారులకు తాఖీదులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కొవిడ్‌ నిర్ధారణ కోసం నమూనాల సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ బుధవారం తాఖీదులు జారీ చేశారు. వీరంతా 48 గంటల్లో సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రశాంతి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నమూనాల సేకరణ లక్ష్య సాధనలో విఫలమైన వారికి నోటీసులు జారీ చేయాల్సిందిగా సూచించారు. ఇందులో భాగంగా 37 మంది వైద్యాధికారులకు తాఖీదులు పంపారు.


30న జిల్లా మహిళా క్రికెట్‌ తుది జట్ల ఎంపికలు

విజయవాడ క్రీడలు: జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న మూలపాడులోని ఏసీఏ క్రికెట్‌ మైదానాల్లో జిల్లా అండర్‌-19, 23, సీనియర్‌ మహిళా క్రికెట్‌ జట్ల తుది ఎంపికలు నిర్వహిస్తామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. ఈ నెల 27న నిర్వహించిన ఎంపిక పోటీల నుంచి 34 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. వారందర్నీ జట్లుగా విభజించి 30న ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లు నిర్వహించి తుది జట్లను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.


డిపాజిట్‌దారుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : అగ్రిగోల్డ్‌లో రూ.20వేల లోపు పెట్టుబడులు పెట్టిన వారికి ఆగస్టు 24న చెక్కులు ఇస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించటం హర్షణీయమని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 31న సీఎం క్యాంపు కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్‌ హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితులు నిర్వహిస్తున్న దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య వీటిని ప్రారంభించారు. తొలుత ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన 13.52 లక్షల మందికి రూ.1,150 కోట్లు, పరిహారంగా రూ.10లక్షలు చెల్లిస్తామని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2019, నవంబరులో రూ.234 కోట్లు మాత్రమే రూ.10వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి ఇచ్చారని తెలిపారు. తమ దీక్షల ఫలితంగా సీఎం స్పందించటం శుభసూచికమన్నారు. బడ్జెట్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, కానీ రూ.916 కోట్లు కావాలని పేర్కొన్నారు. వీటితో ఏ విధంగా న్యాయం చేస్తారో స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంగా డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ.. భవిష్యత్‌ అవసరాల కోసం పేదలు దాచుకున్న డబ్బులను దోచుకున్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం బాగానే ఉందని, పేదలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జప్తు చేసిన ఆస్తులను సాధ్యమైనంత త్వరగా వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏడో రోజు దీక్షల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతం, చిత్తూరు జిల్లాకు చెందిన బాధితులతోపాటు నాయకులు అక్కినేని వనజ, వి.తిరుపతిరావు, బి.వి.చంద్రశేఖర్‌, శేషుకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


నేడు వన్‌ స్టాప్‌ కేంద్రం భవనం ప్రారంభం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో మహిళల సంరక్షణ కోసం జిల్లా మహళా ప్రగతి ప్రాంగణంలో నిర్మించిన వన్‌ స్టాప్‌ కేంద్రం భవనాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.


దిగువ జలాశయాలకు భారీగా వరద నీరు

విజయపురిసౌత్‌: కర్ణాటకలోని కృష్ణా పరివాక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దిగువ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ నీటిమట్టం 541.90 అడుగులకు పెరిగింది. సాగర్‌ ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి 8064 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


ర్యాలీకి 62 శాతం హాజరు

ఎస్వీఎన్‌కాలనీ(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి 62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని లైజనింగ్‌ అధికారి డాక్టర్‌ వి.శ్రీనివాసరావు తెలిపారు. 13వ రోజైన బుధవారం మొత్తం 2,282 మందికి 1,411 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. థర్మల్‌ స్కానింగ్‌, ఎత్తు కొలత అనంతరం 1.6 కి.మీ. పరుగు నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మిగతా పోటీలు జరిగాయి. ఇందులో ఎంపికైన వారికి గురువారం వైద్య పరీక్షలు ఉంటాయి. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వెనక్కి పంపిన వారికి 29న ఫిజికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.


అటవీ అభివృద్ధి సంస్థ రిసార్ట్స్‌లో పెరిగిన ధరలు

బాపట్ల: సూర్యలంక రోడ్డులోని ఏపీ అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన నేచర్‌ క్యాంప్‌ రిసార్ట్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. రిసార్ట్స్‌ గదుల అద్దె ధరలను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం శుక్ర, శని, ఆదివారాలు రూ.3500, మిగిలిన నాలుగు రోజుల్లో రూ.3 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని