పక్కాగా పోషకాహారం పంపిణీ
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

పక్కాగా పోషకాహారం పంపిణీ


మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత

జిల్లాపరిషత్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలు, బాలల ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని పక్కాగా పంపిణీ చేయాలని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశించారు. గుంటూరులోని ఆ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, 13 జిల్లాల పథక సంచాలకులతో సమీక్షా సమావేశాన్ని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్‌.అనూరాధ, సంచాలకులు కృతిక శుక్లాతో కలిసి మంత్రి బుధవారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. కరోనా కారణంగా జిల్లాల అధికారులతో జూమ్‌లోనే మాట్లాడటంతో శాఖా కార్యక్రమాల అమలుపై కొంత పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. దీంతో నేరుగా సమావేశాన్ని నిర్వహించి జిల్లాల్లో కార్యక్రమాలు, పథకాల అమలుపై సమీక్షించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా మహిళలు, బాలల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ రూ.1800 కోట్లను కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేయాలని అధికారులకు చెప్పామన్నారు. సీడీపీవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పోషకాహార సామగ్రిని కొందరు దారి మళ్లిస్తున్నారన్నారు. ఇకపై పోషకాహార వస్తువులు నల్లబజారులో ప్రత్యక్షమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నం స్వధార్‌ హోం నుంచి ముగ్గురు మహిళలు పారిపోవడంపై జిల్లా అధికారిని వివరణ కోరామన్నారు. కొన్ని జిల్లాల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ సిబ్బంది పోస్టులు ఎస్టీలకు రిజర్వు చేసిన చోట్ల మిగిలిపోతున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.

అత్యాచార బాధితురాలి కేసు విచారణ

ఇటీవల సీఎం జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విచారణ కొనసాగుతుందని మంత్రి వనిత చెప్పారు. ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రధాన నిందితుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారన్నారు. మహిళల సంరక్షణ కోసం వన్‌ స్టాఫ్‌ కేంద్రాలను జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరులో వన్‌ స్టాఫ్‌ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని