ఊపందుకున్న వరి నాట్లు
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

ఊపందుకున్న వరి నాట్లు

ఉరకలేస్తున్న పంట కాల్వలు


బందరు కాల్వలో జలకళ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 43 శాతం పైగా పూర్తయ్యాయి. సాగుకు నీటి అవసరం కావడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు బుధవారం నీటి విడుదల పెంచారు. కాల్వలకు మంగళవారం 5,977 క్యూసెక్కులు ఇవ్వగా, బుధవారం 6,431 క్యూసెక్కులకు పెంచారు.

సముద్రంలోకి 9,581 క్యూసెక్కులు..: కృష్ణా నది దిగువున ప్రకాశం బ్యారేజీ వద్ద వరద త్రీవత తగ్గింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి బ్యారేజీకి 22,367 క్యూసెక్కులు రాగా, 22 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 16,390 క్యూసెక్కులు, కాల్వలకు 5,977 క్యూసెక్కులు విడుదల చేశారు. కాల్వలకు ఉదయం 9 గంటలకు 6,179 క్యూసెక్కులు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 16,012 క్యూసెక్కులు రాగా, 13 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 9,581 క్యూసెక్కులు, కాల్వలకు 6,431 క్యూసెక్కుల మేర విడుదల చేశారు. బ్యారేజీకి పులిచింతల వైపు నుంచి 6,773, కీసర (మునేరు) నుంచి 7,999 క్యూసెక్కులు.. ఇతర వాగులు, వంకల నుంచి మొత్తం 16,012 క్యూసెక్కులు వస్తోంది.

కృష్ణా తూర్పు కాల్వకు 4,613 క్యూసెక్కులు.. : ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు (కేఈ) ప్రధాన పంట కాల్వకు 4,613 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ (కేడబ్ల్యూ) ప్రధాన కాల్వకు 1,818 క్యూసెక్కులు ఇస్తున్నారు. కేఈ ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 2,005, బందరు కాల్వకు 1,515, కేఈబీ (కరవు) కాల్వకు 552, ఏలూరు కాల్వకు 541 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని