దేవినేని అరెస్టుపై పెల్లుబికిన నిరసన
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

దేవినేని అరెస్టుపై పెల్లుబికిన నిరసన

ఎస్సీ ఎస్టీ కేసుపై అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు

తెదేపా నేతల గృహ నిర్బంధం


నందివాడ ఎస్సై చిరంజీవి, పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

ఈనాడు, అమరావతి : మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు పోలీసులు ముందస్తుగా తెదేపా ముఖ్యనేతలను అన్ని నియోజకవర్గాల్లో గృహ నిర్బంధం చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పోలీసులు తెదేపా నాయకుల ఇళ్ల వద్ద మోహరించారు. పలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మాజీ మంత్రి దేవినేనిపై పలు సెక్షన్ల కింద పోలీసు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తప్పుడు కేసులు నమోదు చేశారని పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. దేవినేని ఉమా లక్ష్యంగా ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. అసలు కారులో నుంచి కిందకు దిగని మాజీ మంత్రి దేవినేనిపై హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కేసులు ఎలా పెడతారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు బుధవారం సాయంత్రం జూమ్‌ యాప్‌ ద్వారా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసుస్టేషన్‌ నుంచి మైలవరం మెజిస్ట్రేట్‌ ముందు దేవినేని ఉమాను హాజరుపర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవినేని ఉమాను అరెస్టు చేసినట్లు ప్రకటించి ముందుగా పెదపారుపూడి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి బుధవారం ఉదయమే 6గంటలకు నందివాడ పీఎస్‌కు తరలించారు. నందివాడ గ్రామాన్ని పోలీసుల దిగ్బంధంలో ఉంచారు. స్థానికులను కూడా అనుమతించలేదు. ఆధార్‌ కార్డు చూపిస్తేనే గ్రామం లోపలికి అనుమంతించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెదేపా కార్యకర్తలను గ్రామ పొలిమేరల్లో పోలీసులు అడ్డుకున్నారు. మీడియాను సైతం లోపలికి రానీయకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు. దీంతో తెదేపా కార్యకర్తలు అక్కడ నినాదాలతో నిరసన తెలిపారు.


కోర్టుకు తరలించేందుకు దేవినేని ఉమామహేశ్వరరావును తీసుకొస్తున్న పోలీసులు

ఎక్కడికక్కడ నిర్బంధం..

మంగళవారం అర్ధరాత్రి నుంచే తెదేపా నేతల ఇళ్లకు పోలీసుల రాక ప్రారంభమైంది. నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. జగ్గయ్యపేటలో పార్టీ విజయవాడ లోక్‌సభ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యలను, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను, విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌.. తదితర నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. నాయకులు ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా ద్వారా దేవినేని అరెస్టును నిరసించారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.

జిల్లా వ్యాప్తంగా నిరసనలు..

దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, ఎస్సీ ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పలువు తెదేపా నేతలు వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. వీరులపాడు గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, మైలవరం, రెడ్డిగూడెం, చందర్లపాడు, తిరువూరు, చల్లపల్లి, పెనమలూరు, ప్రసాదంపాడు, నూజివీడు తదితర ప్రాంతాల్లో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని