ఇక బాదుడే..
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

ఇక బాదుడే..

సవరణ తీర్మానాల తిరస్కారం

కౌన్సిల్‌ లోపల, వెలుపల విపక్షాల నిరసన

మీడియాను అనుమతించాలంటూ తెదేపా కార్పొరేటర్ల నిరసన

నగరపాలక సంస్థ : నగరవాసులపై ఆస్తిపన్ను బాదుడికే కౌన్సిల్‌ సై అంది. 2.6 లక్షల ఎస్సెస్‌మెంట్‌దార్లపై ఆస్తి విలువ ఆధారిత పన్నుభారం తప్పదని తేలిపోయింది. 198 జీవో ఆధారిత ప్రతిపాదనను కౌన్సిల్‌ ముందు ప్రవేశపెట్టగా, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం ఆమోదం తెలిపింది. రూ.530 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే ప్రభుత్వ ఉత్తర్వులకు ఆమోదం తప్పదని కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. ఆస్తిపన్ను పెంపుదలపై 3,085 అభ్యంతరాలు వచ్చాయని, వాటిపై కౌన్సిల్‌ నిర్ణయం ఆధారంగా ముందుకు వెళతామని ప్రకటించారు. 20 ఏళ్ల క్రితం నివాస ప్రాంతాల్లో ఆస్తిపన్ను పెంపుదల జరిగిందని, ప్రస్తుతం 2,06,799 అసెస్‌మెంట్లు ఉండగా, 50 శాతం మందిపై మాత్రమే పెంపుదల ఉంటుందని, మురికివాడల ప్రాంతాల్లోని వారిపై ఇప్పటికన్నా తగ్గింపు ఉంటుందన్నారు. స్వచ్ఛంద , ఇతర సంస్థలు, ఛారిటీలకు పన్నులో రాయితీలు ఉంటాయని, అనుమతిలేని కట్టడాలపై మాత్రం 100 శాతం అపరాధ రుసుము తప్పదని కమిషనర్‌ తేల్చి చెప్పారు. ఖాళీ స్థలాలపై 0.50 శాతం పన్ను ఉంటుందని, నిర్వహణ లోపం ఉంటే 25 శాతం అపరాధ రుసుము తప్పదన్నారు. అభ్యంతరాలుంటే ప్రజలు రివిజన్‌ పిటిషన్లు వేసుకోవచ్చని తెలిపారు. ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్‌(రెవెన్యూ) శారదాదేవి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కొత్త విధానం వ్యాపార, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ఉంటుందని, పేదలు, 370 చదరపు అడుగుల్లో నివాసం ఉండేవారిపై నివాసానికి రూ.50 మాత్రమే పన్ను విధిస్తారన్నారు.ప్రతిపాదిత తీర్మానాన్ని వైకాపా ఫ్లోర్‌లీడర్‌ వెంకట సత్యనారాయణ కౌన్సిల్‌ ముందుంచి సభ్యుల ఆమోదం కోరారు. సభలో అన్నిపక్షాల సభ్యులు మాట్లాడేందుకు 3 నిమిషాలు చొప్పున మేయర్‌ అనుమతి ఇవ్వగా, అధికార పక్షం సభ్యులు ప్రభుత్వ ఉత్తర్వులు, ఆస్తి విలువ ఆధారిత పెంపుదల ప్రతిపాదనలకు పూర్తి మద్దతు పలికారు. తెదేపా ఫ్లోర్‌లీడర్‌ నెలిబండ్ల బాలస్వామి, సీపీఎం నాయకుడు బోయి సత్యబాబు మిగిలిన సభ్యులు పాలకపక్షం వైఖరిని తప్పుబట్టారు. దొడ్డిదారిన తెచ్చిన 198 జీవో వల్ల 5 ఏళ్లలో ఆస్తిపన్నులు విపరీతంగా పెరిగిపోతాయని ఆరోపించారు. రూ.2,500 కోట్ల అప్పుల కోసం నగర ప్రజలపై రూ.500 కోట్లకు పైగా పన్నుల భారం మోపేందుకు పాలకులు తీర్మానించడం అత్యంత దారుణమని విమర్శించారు. వైకాపా సభ్యులు విపక్షాల వాదనను విభేదించారు.15వ ఆర్థిక సంఘం నిధులు రూ.514 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నివాస ప్రాంతాల వారికి కొంత ఊరట కలిగించేలా ప్రస్తుతం నిర్ణయానికి భిన్నంగా 0.13 శాతం పన్ను మాత్రమే విధించి వసూలు చేస్తామని, ఫలితంగా 0.02 శాతం తగ్గుతుందన్నారు. అందుకు పాలక సభ్యులు బల్లలు చరచగా, కౌన్సిల్‌ ఆమోదం తెలిపినట్లు మేయర్‌ ప్రకటించారు. సవరణకు పట్టుపట్టిన విపక్షాలు నగరపాలక సంస్థ ప్రాంగణంలో భైఠాయించి నినాదాలు చేశాయి. బోయి సత్యబాబు కౌన్సిల్‌ వెలుపల నిరాహారదీక్షలకు దిగారు.

ఆస్తి పన్ను పెంచొద్దు, చెత్త పన్ను వేయొద్దంటూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీసీఐ, సీపీఎం నాయకులు

తొలి దెబ్బ బెజవాడదే

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 198 జీవోను ఆమోదించిన తొలి నగరపాలక సంస్థగా విజయవాడ నిలిచింది. అద్దె విలువ ఆధారిత ఇంటి పన్ను వసూళ్ల విధానం నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారిత ఇంటి పన్ను విధింపు విధానంలోకి మారడంతో నగర ప్రజలపై రూ.500 కోట్లకుపైగా ఆర్థిక భారం పడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే రూ.15 కోట్ల నుంచి రూ.40 కోట్లకు మించి భారం పడదని పాలకపక్షం వాదిస్తోంది. పన్నుల విధింపునకు సంబంధించిన ముసాయిదా ప్రకటన (డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌)పై నగర పౌరులు, ప్రజా సంఘాలు, రాజకీయపక్షాల నుంచి తగు రీతిలో అభ్యంతరాలు రాలేదని పాలకపక్షం కౌన్సిల్‌లో తెలిపింది. ఈ వాదనను తెదేపా, సీపీఎం తోసిపుచ్చాయి. విపక్షాలు గళమెత్తినప్పటికీ.. ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపుదల ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదిస్తూ సభ ముగిసినట్లు పాలకులు ప్రకటించారు. సభలోనే ఉన్న శాసనసభ్యుడు, మంత్రి సైతం అందుకు పూర్తి మద్దతు పలికారు. దీంతో ఆస్తి పన్నుల పెంపుదల ఉత్తర్వులు రద్దు చేయాలన్న తెదేపా, సీపీఎం వాదన అరణ్య రోదనే అయింది. మరోవైపు తెదేపా, సీపీఎం పక్షాల సవరణ తీర్మానాన్ని సైతం పాలకపక్షం పట్టించుకోలేదు. దీంతో తెదేపా, సీపీఎంలు కౌన్సిల్లోనూ, అనంతరం వెలుపలా తీవ్ర నిరసన తెలిపాయి. సీపీఎం సభ్యుడు కౌన్సిల్‌ వెలుపల నిరాహార దీక్షకు దిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని