చెట్ల నరికివేత అనుమతికి చేయిచాపాడు
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

చెట్ల నరికివేత అనుమతికి చేయిచాపాడు

అధికారులకు చిక్కిన సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌

రెండో నిందితుడిగా తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌


ఏసీబీకి దొరికిన సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌, పక్కన తహసీల్దారు సురేష్‌కుమార్‌

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: టేకు చెట్లు నరుక్కునేందుకు అనుమతి కోసం డబ్బులు డిమాండ్‌ చేసి తహశీల్దార్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీకి చిక్కిన ఘటన నూజివీడులో బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... నూజివీడు మండలం రామన్నగూడెంలో మైలవరానికి చెందిన జన్నవరపు జగన్నాథరెడ్డి 31.49 ఎకరాల భూమి చుట్టూ పెంచిన 340 టేకు చెట్లు నరికేందుకు అనుమతి ఇవ్వాలని గతేడాది నవంబర్‌లో తహసీల్దారుకు దరఖాస్తు చేశారు. టేకు చెట్లు నరకాలంటే చెట్టుకు రూ.100 చొప్పున రూ.34 వేలు ఇవ్వాలని సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌ డిమాండ్‌ చేశారు. అంత నగదు ఇచ్చుకోలేనని చెబుతున్నా కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేశారు. ఎంతకీ పని కాకపోవడంతో అడిగినంత ఇస్తానని చెప్పి బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అడిషనల్‌ ఎస్పీ మహేశ్వరరాజు పర్యవేక్షణలో డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సిబ్బంది బుధవారం తహసీల్దారు కార్యాలయంపై నిఘా పెట్టారు. బాధితుడికి నగదు ఇచ్చి కార్యాలయంలోకి పంపించారు. ఆ నగదు తీసుకుంటుండగా అనిల్‌ని పట్టుకున్నారు. ఇందులో తహసీల్దారు భాగస్వామిగా ఉన్నట్లు అనిల్‌ చెప్పడమే కాకుండా ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. దాంతో తహసీల్దార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. ఏసీబీ అందించిన నగదు ముట్టుకున్న ఆనవాళ్లు తహసీల్దారు వద్ద లభించలేదు. ఇద్దరినీ రిమాండ్‌కు పంపామని డీఎస్పీ వివరించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు హేపీకృపానందం, కిశోర్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని