వెల్లువెత్తిన ఫిర్యాదులు
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

వెల్లువెత్తిన ఫిర్యాదులు

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’కి నలుమూలల నుంచి సమస్యలు


రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘ఎస్పీ గారు నా కుమారుడిని చంపేశారయ్య. నెల రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయలేదుంటూ ఓ తల్లి. సార్‌ నా పొలం ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ వృద్ధురాలు. తాగుబోతులు, గంజాయి తాగుతూ అల్లర్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ గ్రామస్థుడు. భర్త మరో మహిళను వివాహం చేసుకుంటే ఆమె తరఫు బంధువులు తనను బెదిరిస్తున్నారంటూ ఓ గృహిణి. విషం కలిపి చంపడానికి యత్నించారంటూ ఓ గ్రామస్థుడు’ ఇలా అనేకమంది ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమంలో ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రామీణ గుంటూరు జిల్లా ప్రజల కోసం బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ తన కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. 25 మంది ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించారు. వాటిపై ఎస్పీ అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత డీఎస్పీ, సీఐలతో మాట్లాడారు. ఫిర్యాదుదారులు ఫోన్‌లో ఉండగానే వారికి వినిపించేలా పోలీసు అధికారులను సదరు కేసు విషయంలో ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సత్తెనపల్లికి చెందిన నాగమల్లేశ్వరి తన కుమారుడిని జూన్‌ 24న చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. వెంటనే ఎస్పీ ఆ ఎఫ్‌ఐఆర్‌ వివరాలు తెలిపగలరా అని అడిగితే, ఆమె తాను చదువుకోలేదని చెప్పింది. దీంతో ఎస్పీ సత్తెనపల్లి పోలీసులకు ఫోన్‌ చేసి ఈ కేసు విషయమై మాట్లాడగా అతను ఉరివేసుకొని మృతి చెందాడని సమాధానమిచ్చారు. ఆ తల్లి చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో వెంటనే అందుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుతోపాటు లోతుగా దర్యాప్తు చేసి ఆమెకు న్యాయం చేయాలన్నారు. మాచర్లకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తమకు మాచవరంలో ఉన్న పొలాన్ని కొంతమంది ఆక్రమించారని, వాటిపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆక్రమణదారులు బెదిరిస్తున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. వృద్ధురాలు తన ఇంటి వద్దనే ఉంటే పోలీసులను అక్కడకు పంపించి ఫిర్యాదు తీసుకొని నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అవి సివిల్‌ వివాదాల కిందకు వస్తాయ్‌...

ఇళ్లు, స్థలాలు, పొలాలు ఇలా ఆస్తులకు సంబంధించిన వాటిపై అధికంగా ఫిర్యాదులు రావడంతో అవి సివిల్‌ వివాదాల కిందకు వస్తాయని, వాటిలో పోలీసులు జోక్యం చేసుకోరని తెలిపారు. వాటికి సంబంధించి క్రిమినల్‌ చర్యలు ఉంటే వాటిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా అది తమ పరిధిలోది కాదన్నారు. ఇతర శాఖల పరిధిలోని అంశాలపై వచ్చిన ఫిర్యాదుల మీద కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఏఎస్పీలు మూర్తి, బిందుమాధవ్‌, రిశాంత్‌రెడ్డి, ప్రసాద్‌లు పాల్గొన్నారు.

ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

ఈ సందర్భంగా ఎస్పీ విలేఖరులతో మాట్లాడారు.‘గ్రామీణ గుంటూరు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి రావడానికి ప్రతి సోమవారం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందిపడటం చూస్తున్నాను. వాటిని తొలగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సోమవారం స్పందనతోపాటు బుధవారం డయల్‌ యువర్‌ ఎస్పీ ఉంటుంది. పోలీసు కార్యాలయంలో ప్రతి రోజు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ నంబరు 8688405050, వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 8866268899కి ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ రికార్డు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు.

-రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని