‘హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం’
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

‘హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం’


కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా నాయకులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గోమాతపై దూషణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గోరక్షణ చట్టంపై వైకాపా నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గోమాతపై వైకాపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్చి, మసీదు నిర్మాణాలకు నిధులిస్తున్నారని, హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ భారతీయులు పవిత్రంగా భావించే గోమాతపై వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గోవులకు మేత వేసి, పూజ చేశారు. ఓ వ్యక్తి రాక్షస అవతారం వేసి, అతనికి వైకాపా స్టిక్కర్‌ను అంటించి నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం గోవధ చేస్తున్నట్లుగా ప్రదర్శన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీ పి.ప్రశాంతికి వినతిపత్రం అందించారు. ధర్నాలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, భాజపా నాయకులు జూపూడి రంగరాజు, కె.సైదారెడ్డి, సాంబయ్య, మాగంటి సుధాకర్‌ యాదవ్‌, ఎ.ఆంజనేయులు, టి.రామకృష్ణ, తాళ్ల వెంకటేష్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శులు ఎ.రంగ, ఆర్‌.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని