అమరావతిలో రహదారుల తవ్వకాలపై చర్యలు తీసుకోండి
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

అమరావతిలో రహదారుల తవ్వకాలపై చర్యలు తీసుకోండి


రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి వినతిపత్రం అందజేస్తున్న రాజకీయేతర ఐకాస కన్వీనర్‌ మల్లికార్జునరావు, సభ్యులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన రహదారులను కొంతమంది తవ్వకాలు చేస్తూ గ్రావెల్‌, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి నాన్‌ పొలిటికల్‌ జేఏసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు జేఏసీ కన్వీనర్‌ మల్లికార్జునరావు, సభ్యులతో కలిసి బుధవారం రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లికార్జునరావు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రలోభాలకు గురై, అమరావతిపై కక్షతో రహదారులు తవ్వకాలు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలన్నారు. ఓ ప్రజాప్రతినిధి తమ ప్రాంతంలో వర్షాలకు రోడ్లు పాడై పోతే, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకు వచ్చి రహదారులు వేయించుకోవడం చేతకాక అమరావతిలో రహదారులు తవ్వించి గ్రావెల్‌, ఇసుకను అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రోడ్లు పాడై పోతే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప, ప్రజాప్రతినిధిగా ఉండి ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఆపకపోతే 24 గ్రామాల్లోని ప్రతి పౌరుడు పోలీసుగా మారి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిని పట్టుకొని అధికారులకు అప్పగిస్తారని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు తీసుకు రావొద్దని హితవు పలికారు. అదే విధంగా నిర్మించి ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఉంచడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయన్నారు. వెంటనే గృహాలను పంపిణీ చేయాలని లేదా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రహదారుల తవ్వకాలపై తాము ఇచ్చిన వినతిపత్రంపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే తుళ్లూరు సీఐకి ఫోన్‌ చేసి అక్రమ తవ్వకాలపై దర్యాప్తు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ సభ్యులు శ్రీనివాసరావు, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని