కాల్వ గట్లపై కబ్జాల దందా..!
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

కాల్వ గట్లపై కబ్జాల దందా..!

ఆక్రమించి శాశ్వత భవనాల నిర్మాణం

పేదలకు అద్దెకు ఇస్తున్న వైనం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, రామవరప్పాడు


కాలువలోనే శాశ్వత భవన నిర్మాణం

విజయవాడ, పరిసరాల్లో కాలువ కట్టలకు ఇరువైపులా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే లోపలికీ వెళ్లిపోయారు. ముందు దుకాణం పెట్టే విధంగా ఉంటే రూ.10లక్షలు, వెనుక వైపు ఉంటే.. రూ.5లక్షలకు అనధికారికంగా అమ్మేస్తున్నారు. చిన్నచిన్న వ్యవహారాల్లో ఎక్కువగా స్పందించే అధికారులు, ఈ నిర్మాణాలను అసలు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు నగరం మీదుగా ప్రవహించే బందరు, ఏలూరు, రైవస్‌ కాలువలు కొంతమంది కబ్జాదారులకు కల్పతరువుగా మారాయి. చిరు వృత్తులు చేసుకునే నిరుపేదలు నగరానికి దూరంగా ఉండలేని పరిస్థితి. వారు నివాసాలను ఇలా కాలువ కట్టలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి దగ్గర నుంచి అద్దెలను వసూలు చేస్తున్నారు. తమ పలుకుబడితో విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పిస్తున్నారు. రోడ్డు మీద కుళాయి ఏర్పాటు చేయిస్తున్నారు. ఏటవాలుగా ఉండే కాలువ కట్టపై మూడు నుంచి నాలుగు గదులు నిర్మాణం చేస్తున్నారు. కొంతమంది రేకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటే.. నాయకులు మాత్రం సిమెంట్‌ కాంక్రీట్‌ పిల్లర్లతో శాశ్వత భవనాలే కట్టేస్తున్నారు.

*● బందరు కాలువ ఎడమగట్టును పెద్ద సంస్థలు ఆక్రమించి భారీగా భవనాలు నిర్మించాయి. యనమలకుదురు నుంచి కంకిపాడు వరకు దాదాపు 18 కిలోమీటర్లు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి.

*● ఏలూరు కాలువ పరిధిలో ప్రస్తుతం రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో కొత్తగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు.

*● వాస్తవానికి కాలువ కట్టలకు ఇరువైపులా జీపులు వెళ్లేందుకు ట్రాక్‌లు ఉండాలి. ఎక్కడా అవి కనిపించడం లేదు. 20 అడుగుల వెడల్పుతో కట్టలు ఉండాలి. ఏటవాలుగా ఉండే 20 అడుగులను కలిపి ఆక్రమిస్తున్నారు. 50 అడుగుల వెడల్పుతో కాలువ గర్భం ఉండాలి. ఇది ఇప్పుడు పూర్తిగా కుంచించుకుపోయింది.

*● మూడు కాలువల కట్టలపై నివాసం ఉండే జనాభా దాదాపు 2లక్షల మంది పైగా ఉంటారని అంచనా. నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సీవేజీ(మురుగునీరు, మలమూత్రాలు) మొత్తం కాలువలోకి వదులుతున్నారు. ఈ మూడు కాలువల కింద దాదాపు 300 గ్రామాలకు తాగునీరు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. ఇలాంటి కలుషిత నీరు చెరువుల్లోకి చేరి అక్కడి నుంచి రక్షిత పథకాల ద్వారా గ్రామాలకు చేరుతుంది.

కాలువలను పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటామని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ మురళీకృష్ణారెడ్డి చెప్పారు. కింది స్థాయి సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

* ● 2019 వరకు ఉన్న ఆక్రమణలను గుర్తించి వారికి ఇతర ప్రాంతాల్లో నివేశన స్థలాలు, టిడ్కో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కాలువ గట్లపై ఇళ్లను తొలగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ ఆక్రమణల జోరు పెరిగింది. తాడిగడప ప్రాంతంలో బందరు రహదారి విస్తరణతో ఆక్రమణలు తొలగించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి, కాలువకు మధ్య ఉన్న స్థలం కబ్జాకు గురయ్యింది. పోరంకి, పెనమలూరు ప్రాంతంలోనూ ఇదే విధంగా ఆక్రమించారు.

* ఏలూరు కాల్వ గర్భంలో కాంక్రీట్‌ పిల్లర్లతో సెంటున్నర పైగా స్థలంలో గదులు నిర్మిస్తున్నారు. నీరు విడుదల చేయడంతో పునాదుల వరకు నీట మునిగింది. రేపోమాపో దీనికి స్లాబ్‌ వేయనున్నారు. రామవరప్పాడు సమీపంలో కార్మికనగర్‌ వద్ద జరుగుతున్న నిర్మాణమిది. అక్కడ సెంటు విలువ రూ.లక్షల్లో ఉంది. ఓ నాయకుని అండదండలతో నీటిపారుదల శాఖకు చెందిన ఓ ఉద్యోగి సాయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి నెలకు రూ.5వేల వరకు పేదలకు అద్దెలకు ఇస్తున్నారు. సొంతం చేసుకోవాలంటే.. ఈ సెంటున్నర స్థలానికి రూ.5లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని