నేరాల నియంత్రణే లక్ష్యంగా రూపకల్పన
eenadu telugu news
Published : 31/07/2021 06:24 IST

నేరాల నియంత్రణే లక్ష్యంగా రూపకల్పన

నూతన సాంకేతిక విధానంలో పర్యవేక్షణ

ఈనాడు, అమరావతి


కె.ఆరిఫ్‌ హఫీజ్‌, ఎస్పీ, గుంటూరు అర్బన్

పోలీసులు ఏ సమయంలో రహదారులపై గస్తీ తిరుగుతారో నేరగాళ్లకు తెలుసు. ఆ సమయాల్లో వారు జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు వచ్చే వేేళల్లో చోరీలకు పాల్పడకుండా నేరగాళ్లే తమ పంథాను మార్చుకున్నా పోలీసులు మాత్రం ఇంకా మూస విధానంలోనే బీట్లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బీట్ల విధానాన్ని పూర్తిగా సంస్కరించి ప్రజల ఆస్తి, మాన ప్రాణాలకు రక్షణ కల్పించేలా గుంటూరు అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ రూపకల్పన చేశారు. గుంటూరు అర్బన్‌ జిల్లాలో ప్రస్తుతం ప్రతి స్టేషన్‌ పరిధిలో రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కానిస్టేబుల్‌ మొదలుకుని ఎస్సై, సీఐల దాకా ప్రతి ఒక్కరూ రహదారులపైనే గస్తీ తిరుగుతూ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఆ సమయాల్లో పోలీసులు రహదారులపైనే ఉంటున్నారని భావించి నేరగాళ్లు నేరాలు చేయటానికి ఏకంగా వారు తమ సమయాలను మార్చుకున్నారు. గడిచిన మూడు నెలల్లో నమోదైన నేరాల చిట్టాను పరిశీలిస్తే అత్యధిక చోరీలు, ఇతర అఘాయిత్యాలు రాత్రి 7 తర్వాత, లేదా సాయంత్రం 5 గంటలకు ముందే జరిగాయని నేర రికార్డులు చెబుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన నేర సమీక్షలో (క్రైం మీటింగ్‌) ఎస్పీ ప్రస్తుతం ఉన్న బీట్ల విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి దాన్ని పూర్తిగా మార్చాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని అరండల్‌పేట, పట్టాభిపురం, నగరంపాలెం, లాలాపేట, పాతగుంటూరు, కొత్తపేట, నల్లపాడు సర్కిళ్లతో పాటు ప్రత్తిపాడు, చేబ్రోలు, మంగళగిరి, తాడేపల్లి సర్కిల్స్‌లో నేరాలు చోటుచేసుకునే అన్ని ప్రాంతాలను ఆయా స్టేషన్లతో మ్యాపింగ్‌ చేయించారు. ఆ మ్యాపింగ్‌ సహాయంతో ఎస్పీ తన సెల్‌ఫోన్‌ లేదా కమాండ్‌ కంట్రోల్‌ రూంలో కూర్చొని నేరాలు జరిగే ప్రాంతాలు, ఈవ్‌టీజింగ్‌కు అడ్డాలుగా ఉన్న కూడళ్ల వద్ద పోలీసులు గస్తీ తిరుగుతున్నారా? లేదా అనేది పరిశీలించుకునేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ రకమైన పరిశీలన లేకపోవడంతో రహదారులపై గస్తీ తిరిగే పోలీసులు ఎందరు అనేది ఎవరికీ తెలియకుండా ఉంది. అడపాదడపా తనిఖీలకు వస్తే తప్ప తెలుసుకోలేని పరిస్థితి. ఈ మూస విధానానికి పూర్తిగా స్వస్తిపలికి ప్రతి రోజూ బీటింగ్‌ సమయాలను మారుస్తూ ఎప్పటికప్పుడు పోలీసులు రహదారులపై తిరుగుతూ నేరాల కట్టడికి చర్యలు తీసుకునేలా బీట్ల విధానాన్ని సంస్కరించారు. నూతన విధానంలో ‘ఎవరు బీట్లకు హాజరవుతున్నారు? ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు.. ఏదైనా జరిగితే ఘటనా ప్రదేశానికి పోలీసులు ఎంత సమయంలో చేరుకున్నారో’ ప్రతిదీ తెలుసుకునేలా ఆయా స్టేషన్ల పరిధిలో అన్ని ప్రాంతాలను మ్యాపింగ్‌ చేయించారు. ఈ విధానం తక్షణమే ఆచరణలో పెట్టాలని ఇటీవల జరిగిన నేరసమీక్షలో డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.

పోలీసు బీట్లలో...సంతకాలు తప్పనిసరి...

గడిచిన మూడు నెలల్లో ఎక్కడైతే నేరాలు అధికంగా చోటు చేసుకున్నాయో ఆ ప్రాంతాలతో పాటు ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే ప్రాంతాలను తప్పనిసరిగా నూతన బీట్ల విధానంలో కవర్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇలా ఉండేదికాదు. జన రద్దీ కూడళ్లు, వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాలు, శివారు కాలనీల్లో మాత్రమే పోలీసు బీట్లు మొక్కుబడిగా ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తిగా మార్చేశారు. ప్రతి ఠాణా పరిధిలో బీట్ల సంఖ్యను పెంచారు. ఆ బీట్ల పరిధిలో ఎక్కడ చోరీ జరిగినా, హత్య జరిగినా ఘటనా ప్రదేశానికి నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకునేలా సాధ్యమైనంత వరకు బీటు పరిధిని కుదించారు. అదనపు బీట్లు ఏర్పాటు చేసి పోలీసుల సంఖ్యను పెంచారు. గతంలో సగం మందే బీట్ల విధులకు హాజరయ్యేవారు. మిగిలిన సిబ్బంది నేరగాళ్లను పట్టుకురావడానికి, వారెంట్లు జారీ చేయడానికి, ఇతరత్రా పనుల్లో ఉన్నామని తప్పించుకునేవారు. ప్రస్తుతం ప్రతి కానిస్టేబుల్‌ను బీట్ల విధులకు హాజరయ్యేలా చూడాలని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది బీటు నిర్వహించే ప్రదేశంలో ఒక ఇంట్లో పుస్తకం పెట్టి దానిలో వారి సంతకం తీసుకోవాలని, దీన్ని కచ్చితంగా పాటించాలని ఎస్పీ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. బీట్ల విధులకు వెళ్లే కానిస్టేబుళ్లు కూడా స్టేషన్‌లో ఒక పుస్తకం పెట్టుకుని తాము పలానా బీట్‌ విధులకు హాజరయ్యామని అందులో ప్రతి రోజూ సంతకాలు చేయాలి. దీని ఆధారంగా నెలలో ఎవరెన్ని రోజులు బీట్ల విధులకు హాజరయ్యారో నిర్ధారించుకుంటారు.


నేరాల కట్టడే లక్ష్యంగా సరికొత్త బీట్ల విధానానికి రూపకల్పన చేశాం. దీన్ని నూతన సాంకేతిక విధానంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా అర్బన్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేశాం. ఇంతకుముందు ఈ విధానం ఉంది. నేరగాళ్లు తమ పంథాను మార్చుకుని పోలీసులు గస్తీ తిరగని వేళల్లోనే ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నారు. తాడేపల్లి అత్యాచార బాధితురాలి ఉదంతం కూడా ఈ బీట్ల మార్పిడికి ఓ కారణం. తాను తనిఖీలు చేసినప్పుడు బీట్ల పుస్తకాల్లో సంతకాలు చేయకపోయినా, వాటిపై సీఐ, డీఎస్పీలు కౌంటర్‌ సిగ్నేచర్‌ చేయకపోయినా చర్యలు తీసుకుంటాం.

-కె.ఆరిఫ్‌ హఫీజ్‌, ఎస్పీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని