రాష్ట్ర పరిపాలనా సర్వీసు ఏర్పాటు చేయాలి
eenadu telugu news
Published : 31/07/2021 06:24 IST

రాష్ట్ర పరిపాలనా సర్వీసు ఏర్పాటు చేయాలి

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పరిపాలనా సర్వీసును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో గ్రూప్‌ 1 డైరెక్ట్‌ రిక్రూటీ అధికారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి సర్వీసు అభ్యున్నతికి ఒకే విధమైన పరీక్షా విధానం ద్వారా నియమించినప్పటికీ వివిధ శాఖల్లో వారికి సంబంధించి ఉద్యోగోన్నతులు వంటి అవకాశాల్లో సమానత్వం కొరవడిందన్నారు. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రంలో పరిపాలనా సర్వీసు ఒక్కటే మార్గమన్నారు. దీని ద్వారా మరింత మెరుగైన పాలనా విధానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను సక్రమ పద్ధతిలో అమలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందంచడంలో గ్రూప్‌ 1 అధికారులే కీలక పాత్ర వహిస్తారన్నారు. విశ్రాంత డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఆగస్టు 8న గ్రూప్‌1 డైరెక్ట్‌ రిక్రూటీ అధికారులతో రాష్ట్ర స్థాయి మేథోమదన సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలతో పాటు విశ్రాంత అధికారులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జి.నాగసాయి, కోశాధికారి ఆర్‌.లక్ష్మణ్‌, వివిధ శాఖలకు చెందిన గ్రూప్‌ 1 అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని