రేషన్‌ పంపిణీ 81 శాతమే
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

రేషన్‌ పంపిణీ 81 శాతమే

కేంద్ర ప్రభుత్వ బియ్యం

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో జులై 31వ తేదీ వరకు చౌక డిపోల ద్వారా 81.7 శాతం మేర మాత్రమే పంపిణీ చేశారు. నూరు శాతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో డిపోల ద్వారా పంపిణీ చేపట్టినా.. సరైన రీతిలో అమలవ్వలేదు. జులై 16వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నా.. సర్వర్‌ మొరాయింపుల వల్ల 21వ తేదీ వరకు పంపిణీ మొదలు కాలేదు. వాలంటీర్లకు కేటాయించిన క్లస్టర్లకు రేషన్‌ డిపోలు దూరంలో ఉండటం తదితర కారణాలతో పంపిణీ సరిగా జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర కోటా కంటే 12 శాతం తక్కువ

జులై 2వ తేదీ నుంచి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ ఎండీయూల ద్వారా ఇంటింటికీ ప్రారంభమైంది. 14వ తేదీ వరకు, మొత్తంగా 93 శాతం మేర పంపిణీ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రేషన్‌ డిపోల ద్వారా చేపట్టిన పంపిణీ.. 81 శాతంగా నమోదైంది. విజయవాడతో పాటుగా జిల్లాలోని కొన్ని డిపోల్లో కేవలం 30 శాతం మేరే సరకుల పంపిణీ జరగడంతో కారణాలను అన్వేషించే పనిలో అధికారులు డిపోల్లో తనిఖీలు చేపట్టారు.

విజయవాడలో 4 డిపోల్లో తనిఖీ

విజయవాడ సర్కిల్‌-2 సహాయ పౌరసరఫరాలశాఖ పరిధిలోని 4 రేషన్‌డిపోల్లో ఇన్‌ఛార్జి ఏఎస్‌వో పి.కోమలి పద్మ శనివారం తనిఖీలు నిర్వహించారు. సత్యనారాయణపురంలోని 209, 210, క్రీస్తురాజుపురంలోని 248, 262 డిపోల్లో.. ఏ కారణంతో పంపిణీ సరిగా జరగలేదనే దానిపై డీలర్లతో సమీక్షించారు. 248 డిపోలో కేవలం 38 శాతం మేర బియ్యం సరఫరా చేశారు. వంద శాతం నమోదైన డిపోలూ ఉన్నాయి. కార్డుదారులు తమకు సమీపంలో ఏ డిపో ఉంటే దాని వద్దకు వెళ్లడంతో తక్కువ శాతం నమోదైందని చెబుతున్నారు.

సర్వర్‌ సమస్య ఉంది..

రాష్ట్ర వ్యాప్తంగా ఇ పోస్‌ సర్వర్‌ సమస్య కారణంగా ఒకింత రెండో విడత బియ్యం పంపిణీ ఆలస్యమైంది. ఆ కారణంగా కొద్దిమేర పంపిణీ శాతం తగ్గి ఉండవచ్చని భావిస్తున్నాం. పంపిణీ శాతం ఇంకా ఫైనల్‌ కావాల్సి ఉంది.

- నారాయణరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి పౌర సరఫరాల శాఖాధికారి

జిల్లాలో మొత్తం రేషన్‌ డిపోలు 2353

రెండో విడత పంపిణీ చేసినవి 10,32,765

జిల్లాలో మొత్తం బియ్యం కార్డులు 13,05,118


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని