స్నేహితం
eenadu telugu news
Updated : 01/08/2021 06:18 IST

స్నేహితం

అవసరానికి ఆదుకునే స్నేహితులుంటే.. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా తేలికగా దాటి వెళ్లిపోవచ్ఛు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒకరో ఇద్దరో ఆప్తమిత్రులు ఉంటారు. కష్టమైనా.. నష్టమైనా.. ఆనందమైనా.. ప్రతి ఘట్టంలోనూ మేమున్నామంటూ వారు వెన్నంటి ఉంటారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన పయనంలో నేరుగా కలిసే అవకాశం ఎక్కువ మందికి ఉండడం లేదు. కానీ.. అందివచ్చిన సాంకేతికత ఆధారంగా నిత్యం ఒకరికొకరు అందుబాటులో ఉంటున్నారు. ఎంత దూరంలో ఉన్నా.. మిత్రుడికి అవసరం వచ్చినప్పుడు మాత్రం నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. అందుకే.. బంధుమిత్రులు, అన్నదమ్ముల కంటే.. మిత్రుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు అధికంగా ఉంటారు. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొంతమంది ఆప్తమిత్రులపై కథనం.

- ఈనాడు, అమరావతి


నాగాంజనేయులు కుటుంబ సభ్యులతో అతని స్నేహితులు

స్నేహితుడి తల్లిని ఆదుకున్న మిత్రులు

కుమారుడి మరణంతో కుంగిపోయిన తమ స్నేహితుడి తల్లికి వెన్నుదన్నుగా నిలిచి తమ కన్నతల్లితో సమానంగా చూసుకుంటున్నారు. జంజనం నాగాంజనేయులు పెనమలూరు పంచాయతీ కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. అతడు 2015లో పోరంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తల్లి శివపార్వతి తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈమెను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. నాగాంజనేయులు స్నేహితులైన అప్పలస్వామి, మట్టా రవి మరికొంతమంది మిత్రులు చలించిపోయారు. స్నేహితుడి తల్లిని తమ మాతృదేవతగా భావించి వైద్య, ఆరోగ్య, ఆర్థికపరంగా ఆదుకుని నాలుగేళ్లలో ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయగలిగారు. అప్పలస్వామి, రవి, దేవరపల్లి అశోక్‌, అబ్దుల్‌ సమీర్‌, లంక రవిశర్మ, మురళీ, నాగరాజులు మాట్లాడుతూ ఇప్పటికీ తమ మిత్రుడు నాగాంజనేయులు వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అనాథ శరణాలయంలోని బాలలకు అన్నదానం చేస్తున్నామని నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.

- న్యూస్‌టుడే, పెనమలూరు


మూడు దశాబ్దాల బంధం

మూడు దశాబ్దాలు దాటినా తమ స్నేహితులను మరువకుండా ఆపద సమయంలో ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు కంకిపాడు మండలం ప్రొద్దుటూరు జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థులు. 52 మంది విద్యార్థులు 1987-88లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తమ స్నేహితుల్లో యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు, ప్రొద్దుటూరి కోటయ్యలు చనిపోయారని తెలుసుకున్నారు. ఆర్థిక సాయం అందజేశారు. గత ఏడాది కరోనాతో చనిపోయిన చాట్ల దుర్గారావు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో తమ అనుభవంతో పేద విద్యార్థులకు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, ఆర్థికంగా సాయపడుతున్నారు. ఇందుకోసం వారు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని స్నేహితుల సంక్షేమానికి కేటాయించడం విశేషం.


సురేష్‌, నరేంద్ర, గోపాలకృష్ణ, రాధాకృష్ణ

ముగ్గురికీ చేయూత ఇచ్చి..

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

విజయవాడ రాజీవ్‌శర్మనగర్‌ ప్రాంతానికి చెందిన కనిగల్పుల సురేష్‌బాబు. తాను ఆర్థికంగా ఎదగడంతో పాటు, స్నేహితుల ఆర్థిక స్వావలంబనకు పాటుపడడం, స్నేహితుల కుటుంబాల్లో సంతోషాన్ని, వెలుగులు నింపేందుకు ముందుంటారు.

కష్టాల కడలి..

సురేష్‌బాబు తండ్రి తన చిరుప్రాయంలోనే కన్నుమూయడంతో అమ్మతో కలిసి అన్నయ్య, వదినల వద్దకు వెళ్లి అక్కడే పెరిగారు. పలు దుకాణాల్లో కొన్నాళ్లపాటు గుమాస్తాగా స్వల్పజీతానికి పనిచేశారు. ఆపై అన్నయ్యకు నెలకొల్పిన దుకాణంలో పనిచేస్తూ నగరంలోని పలు వ్యాపారులతో పరిచయాలు పెంచుకున్నారు. అన్నయ్య సాగించే బిస్కెట్లు, చాక్లెట్ల వ్యాపారాన్ని లాభాల బాట పట్టించేందుకు ఆయన చూపిన చొరవ, కృషితో పలు కంపెనీ ఏజెన్సీలు ఇచ్చాయి. దీంతో ఆర్థికంగా బలోపేతమయ్యారు. తాను ఎదగడంతో పాటు తనతో గడిపిన, నమ్ముకున్న స్నేహితులను వ్యాపార రంగంలోకి ఆహ్వానించి నయాపైసా పెట్టుబడులు పెట్టించకుండానే మెలకువలు నేర్పించి, ఆర్థికసాయం చేసి.. వారి ఉన్నతికి సహకారం అందించారు.

నేస్తాలు ముగ్గురు..

ఆయనకు ఉన్న ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన పెరుమాళ్ల నరేంద్ర కాళేశ్వరరావు మార్కెట్లో తినుబండారాల వ్యాపారం చేస్తూ మంచి స్థితిలో ఉన్నారు. ‘నా కాళ్లపై నన్ను నిలబడేలా చేశారు. చివరకు పెళ్లి చేయడం మొదలు, కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అన్నింటిలోనూ నాకు అండగా ఉంటూ గొప్ప స్నేహితుడిగా నిలిచారు’ అని సురేష్‌ గురించి నరేంద్ర పేర్కొన్నారు.

* పెసలపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘ వ్యాపారంలో సగం అప్పగించి, నా కుటుంబం కడుపు నిండా భోజనం తినేలా చేశారు. వ్యాపార ఒడుదొడుకుల్లోనూ ఆర్థిక సాయంతో అండగా నిలిచి నిజమైన స్నేహానికి అర్థం చెప్పారు’ అని కొనియాడారు.

* మరో స్నేహితుడు రాధాకృష్ణ ప్రస్తుతం జోజినగర్‌ ప్రాంతంలో మిఠాయి వ్యాపారం సాగిస్తున్నారు. ‘30 ఏళ్ల కిందట తెలంగాణ, ఆంధ్రాలోని అనేక జిల్లాల్లో లైన్‌కు వెళ్లి తినుబండారాల వ్యాపారం సాగించుకునేందుకు కొన్ని ఏజెన్సీలు సురేష్‌ అప్పగించారు. అనుకోని విధంగా నష్టాలు వచ్చాయి. ఈ సమయంలో తాను ఉన్నానంటూ పలు విధాలా సాయం చేసి, ఆర్థిక తోడ్పాటు అందించారు. నిలదొక్కుకునేలా చేశారన్నారు.


సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు

మిత్రులు కలిసి రూ.2.2 కోట్లతో..

విజయవాడలోని సిద్థార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, మిత్రులు కలిసి నగరంలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.2.2 కోట్లతో భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఇటీవల ఏర్పాటు చేయించారు. 140 మంది విద్యార్థులు కలిసి డాక్టర్‌ ఎన్‌.అమ్మన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొవిడ్‌ రెండో దశ వీరిని తీవ్రంగా కలచివేసింది. ఆక్సిజన్‌ను ఎక్కడి నుంచో తెచ్చి ట్యాంకుల్లో నింపే అవసరం లేకుండా.. సహజంగా తయారు చేసుకునేలా సిద్ధం చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో గంటకు రెండు వేల లీటర్ల సామర్థ్యంతో, పాతాసుపత్రిలో గంటకు 1200 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేలా ప్లాంట్‌ను నెలకొల్పారు.

- ఈనాడు, విజయవాడ


పార్థు యువరాజ్‌, గోపీ శంకర్‌

కష్టకాలంలో అన్నీ తానై..

నేను మెకానికల్‌ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశాను. ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు పార్ధుతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. రెండోదశ కొవిడ్‌లో మేలో మా అమ్మకు కరోనా సోకింది. అనంతరం నేను, మా నాన్న కూడా పాటిజివ్‌గా తేలింది. ఈ విషయం ఇంటి పరిసరాల్లోని వారికి తెలియడంతో మాకు కనీసం పాలప్యాకెట్‌ కూడా అందలేదు. ఆసుపత్రికి వెళ్దామంటే ఆటోలు కూడా రాని దుర్భర దుస్థితిలో రెండురోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. బంధువులూ రాలేదు. పార్థు కరోనా కిట్‌తో మా ఇంటికి వచ్చాడు. తనకు పరిచయం ఉన్న వైద్యుడు సూచించిన విధంగా మందులను తీసుకొచ్చాడు. అతడు నివాసం ఉంటున్న ఆటోనగర్‌ నుంచి ఉదయాన్నే ద్విచక్రవాహనంపై వచ్చి పాలప్యాకెట్లు, అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందించాడు. రెండు వారాల పాటు మాకు అన్ని విధాలా అండగా నిలిచాడు. బతికి బట్టకట్టాం.

- కృష్ణలంక, న్యూస్‌టుడేTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని