ఎవరి దారి వారిదే..!
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

ఎవరి దారి వారిదే..!

అధికారుల మధ్య సమన్వయ లోపం

దుర్గగుడిలో అన్ని వివాదాలకు అదే కారణం

ఈనాడు, అమరావతి

విజయవాడ దుర్గగుడికి సంబంధించి అధికారులు తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలు, రాజకీయ సిఫార్సులతో అమలుచేసే విధానాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఒక విషయంపై దేవాదాయశాఖ కమిషనర్‌ ఒకరకంగా స్పందిస్తే.. ఆర్‌జేసీ స్థాయి అధికారులు మరోలా, దుర్గగుడి ఈవోలు ఇంకోలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులు మరోలా ఉంటున్నాయి. దీంతో న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.

దేవస్థానం ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలకు సంబంధించిన కేసులే న్యాయస్థానంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గత ఈవో హయాంలో ఓ కేసుకు సంబంధించి ప్రైవేటు న్యాయవాదిని పెట్టి మరీ దేవస్థానానికి చెందిన రూ.ఐదు లక్షలు చెల్లించారు. ఉద్యోగులతో మాట్లాడి.. వారికి నిబంధనల మేరకు న్యాయం చేస్తే.. ఇలా లక్షల రూపాయలను ఏటా న్యాయస్థానాల్లో కేసుల కోసం ఖర్చు చేయాల్సిన పని ఉండదు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను కింద ఉండే ఈవోలు అమలు చేయరు. కొందరికి మాత్రం ఎలాంటి ఆర్డర్లు లేకపోయినా.. ఆలయ ఈవోలకు నచ్చినట్టు వెంటనే పదోన్నతులు ఇచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఈవోలు పంపించిన ఫైళ్లను పైనుండే దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఆపేస్తుంటారు.

ప్రత్యక్ష నిదర్శనాలు అనేకం..

* దుర్గగుడి ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు సంబంధించిన సరిగా వ్యవహరించలేదంటూ గతంలో ఓ ఈవోకు న్యాయస్థానంలో మొట్టికాయలు పడ్డాయి.

* తాజాగా ఓ ఉద్యోగికి పదోన్నతి ఇచ్చేందుకు మరొక ఏఈవోకు రివర్షన్‌ ఇచ్చారు. దీనిపై రివర్షన్‌ ఇచ్చిన ఉద్యోగి.. న్యాయస్థానానికి వెళ్లడంతో దుర్గగుడి అధికారులు చేసిన పని తప్పని తేలింది. కనీసం సమాచారం ఇవ్వకుండా సదరు ఉద్యోగికి రివర్షన్‌ ఇవ్వడంపై మొట్టికాయలు పడ్డాయి.

* శానిటేషన్‌ టెండర్‌ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదంటూ బాధ్యుడిని చేస్తూ ఇటీవల ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. కానీ.. ఇతని కంటే పైన సూపరింటెండెంట్‌, ఏఈవో, ఈవో సహా పలువురు అధికారులుంటారు. వారందరికీ సంబంధం లేకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ను బాధ్యుడిని చేయడంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానంలో అతనికి అనుకూలంగా రెండు రోజుల కిందట తీర్పు వచ్చింది.

* ఆలయానికి చెందిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను ఒక చీర కనిపించడం లేదంటూ సస్పెండ్‌ చేశారు. తర్వాత ఆ చీర కూడా దొరికినా.. అతనిపై వేటు మాత్రం తొలగించలేదు. ఆలయంలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పదోన్నతుల జాబితాలో అతని పేరు ముందుంది. దీంతో అతను కొద్దిరోజుల కిందట న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా మరో ఇద్దరికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు ఇచ్చారు. వీరిలో ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులకు తలొగ్గి పదోన్నతి ఇచ్చేశారు. గతంలోనూ ఇలాగే తమకంటే జూనియర్లకు పదోన్నతులు ఇచ్చారంటూ చాలామంది ఉద్యోగులు న్యాయస్థానాలకు వెళ్లారు.

* దుర్గగుడికి సంబంధించిన టెండర్ల విషయంలోనూ కొంతమంది ఉద్యోగులు తమకు బినామీలుగా ఉండే గుత్తేదారులను న్యాయస్థానాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తుంటారు. తాజాగా.. ఆలయానికి చెందిన శానిటరీ టెండర్‌ విషయంలోనూ ఇదే జరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని