భ్రూణ హత్యలపై చర్యలు తీవ్రం
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

భ్రూణ హత్యలపై చర్యలు తీవ్రం

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఆడ పిల్లల జనన నిష్పత్తి తగ్గిపోతున్న క్రమంలో భ్రూణ హత్యలపై చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా జడ్జి లక్ష్మణరావు, కలెక్టర్‌ నివాస్‌లు పేర్కొన్నారు. ఈ విషయమై మచిలీపట్నం నుంచి జిల్లా జడ్జి శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, విజయవాడలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. జడ్జి లక్ష్మణరావు మాట్లాడుతూ.. గర్భిణులకు స్కానింగ్‌ చేసి, పుట్టబోయే శిశువు ఆడపిల్ల అని బహిర్గతం చేసేవారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్‌ చేయడం, లింగ నిర్ధారణ చేసి, వెల్లడించే విధానమే సరైంది కాదని పేర్కొన్నారు. అవనిగడ్డ ప్రాంతంలో బాలురతో పోలిస్తే.. బాలికల జనన నిష్పత్తి శాతం క్రమేపీ తగ్గుతోందన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందో గుర్తించి, ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. జిల్లాలో స్కానింగ్‌ సెంటర్ల అనుమతుల కోసం 46 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వీటిలో 36 దరఖాస్తులకే సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్కానింగ్‌ కేంద్రాల పని తీరుపై డివిజన్‌ స్థాయి వైద్యాధికారులు లేదా గైనకాలజిస్టు, పోలీసు అధికారి సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు జిల్లా జడ్జికి, కలెక్టర్‌ వివరించారు. లైసెన్సుల పునరుద్ధరణ కోసం.. 8 స్కానింగ్‌ కేంద్రాల నుంచి వినతులు రాగా, వీటిలో 5 దరఖాస్తులు అనుమతి ఇవ్వడానికి అర్హమైనవిగా ఉన్నట్టు చెప్పారు. స్కానింగ్‌ యంత్రాల మార్పిడికి నాలుగు దరఖాస్తులుగా రాగా, వీటిలో మూడింటికి అనుమతినిచ్చే వీలుందన్నారు. పీసీ అండ్‌ పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. డీఎంహెచ్‌వో సుహాసినీ మాట్లాడుతూ.. కరోనా కారణంగా తనిఖీల్లో జాప్యం జరిగిందని జిల్లా జడ్జికి నివేదించారు. జడ్జి లక్ష్మణరావు మాట్లాడుతూ.. స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలని, వాటిపై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిచాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని