గొలుసు దొంగల అరెస్టు
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

గొలుసు దొంగల అరెస్టు

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఏఎస్పీ మనోహరరావు, డీఎస్పీ ప్రశాంతి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేస్తున్న ఇద్దరిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ విలేకరులకు తెలిపారు. శ్రీనివాసరావుపేటకు చెందిన పసుపులేటి సాయినాథ్‌బాబు, కనపర్తి మణికంఠ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులు చోరీ చేస్తున్నారు. సాయినాథ్‌ ద్విచక్ర వాహనం నడుపుతుండగా మణికంఠ వెనక కుర్చొని మహిళల మెడలో గొలుసులు కాజేసేవాడు. జులై 26న గుంటూరు రూరల్‌ మండల పెదపలకలూరు గ్రామంలోని తురకపాలెం రోడ్డులో కిరాణా దుకాణానికి వెళ్లారు. అక్కడ వృద్ధురాలు బాలకోటమ్మను శీతల పానీయం అడిగి తీసుకున్నారు. తాగుతూ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లాలనుకున్నారు. మణికంఠ ఒక చాక్లెట్‌ ఇవ్వాలని అడగ్గా, ఆమె వెనక్కు తిరిగి తీసి ఇస్తుండగా మెడలోని 32 గ్రాముల గొలుసును చోరీ చేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో నల్లపాడు సీఐ ప్రేమయ్య కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో నగరంలో వరుసగా గొలుసు చోరీలు జరగడంతో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చోరులను పట్టుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ ప్రశాంతి, సీఐ ప్రేమయ్య సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం గుంటూరు మున్సిపాల్టీ వద్ద చోరీ చేసిన బంగారపు వస్తువులు విక్రయిస్తుండగా నిందితులను సీఐ, ఎస్సైలు కిషోర్‌, ఆరోగ్యరాజు, సిబ్బంది జాన్‌సైదా, వెంకటనారాయణ, గణేష్‌, బాలాజీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు జులై 15న చౌడవరం గ్రామంలోని బ్యాంకు వద్ద వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసి పరారైనట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. జులై 24న గోరంట్లలోని టెలికంనగర్‌లో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసు కాజేశారన్నారు. మూడు చోరీలు చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల నుంచి 64 గ్రాముల బంగారు వస్తువులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ, సీఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నేర విభాగ ఏఎస్పీ మనోహరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని