నీ ఆట బంగారమే..
eenadu telugu news
Updated : 02/08/2021 13:58 IST

నీ ఆట బంగారమే..

న్యూస్‌టుడే, విజయవాడ క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మురిసిన తెలుగుతేజం పూసర్ల వెంకట సింధుకు విజయవాడతో మంచి అనుబంధం ఉంది. ఆమె తండ్రి, అంతర్జాతీయ వాలీబాల్‌ మాజీ క్రీడాకారుడు పీవీ రమణ నగరవాసే. ఇక్కడే డిగ్రీ చదువుకుని, తన క్రీడా ప్రస్థానానికి నాంది పలికారు. సింధు తల్లి, వాలీబాల్‌ క్రీడాకారిణి విజయది కూడా విజయవాడే. వివాహమైన తర్వాత వారు హైదరబాద్‌లో స్థిరపడ్డారు. ఇక్కడ వారి బంధువులు ఉన్నారు. దీంతో సింధు తరచూ ఇక్కడికి వచ్చేది. స్థానిక క్రీడాకారులతోనూ తన అనుభవాలు పంచుకునేది. చిన్నతనం నుంచి ప్రణాళిక బద్ధంగా క్రమశిక్షణతో కూడిన కఠోర సాధన చేసిన సింధు అంచెలంచెలుగా ఎదిగింది. గత ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సారి పసిడి లక్ష్యంగా కృషి చేసింది. అది చేజారినా, కాంస్య పతకంతో దేశ ఖ్యాతిని రెపరెపలాడించింది. ఈ విజయంపై నగరంలోని వారి కుటుంబ సభ్యులు, క్రీడాకారులు ఆనందోత్సాహం వ్యక్తం చేశారు.

సింధు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా విజయవాడలో సంబరాలు చేసుకుంటున్న క్రీడాకారులు


తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం..

- రామానుజ (సింధు మేనత్త కుమార్తె)

ల్లిదండ్రులు పడిన కష్టానికి ఇది ప్రతిఫలం. సింధు ఏదైనా సాధించాలంటే.. దానికోసం శ్రమిస్తుంది. ఆమె విజయం వెనుక వారి కుటుంబ సభ్యులే కాకుండా.. దేశ ప్రజలంతా ఆమె వెనుక ఉన్నారు.


బాగా కష్టపడింది...

- కొల్లి దీప్తి ( సింధు పెద్దమ్మ కుమార్తె)

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు సింధూ బాగా కష్టపడింది. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా సాధనపై దృష్టి పెట్టింది. చిన్నతనం నుంచి బాబాయ్‌, పిన్ని వాళ్లు బాగా ప్రోత్సహించారు. వరుసగా రెండో సారి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం చాలా గర్వంగా ఉంది.


ఫైనల్స్‌ ఆడుతుందని అనుకున్నాం..

- కొల్లి ఏకాంతరావు (మేనమామ)

సింధు కష్టపడిన దానికి టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌ ఆడుతుందని అనుకున్నాం. శనివారం సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలవడం దురదృష్టకరం. కాంస్య పతకం తప్పకుండా కైవసం చేసుకుంటుందని అనుకున్నాం. ఆదివారం జరిగిన పోటీలో పతకం కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ఎక్కడా తప్పటడుగులు వేయకుండా చాలా బాగా రాణించింది.


అటాకింగ్‌ గేమ్‌ ఆడుతుంది

సింధు మంచి అటాకింగ్‌ గేమ్‌ ఆడుతుంది. పవర్‌ షాట్లు కొట్టడానికి ఆమె ఎత్తు బాగా ఉపయోగపడుతుంది. తోటి క్రీడాకారులందరితో కలిసిమెలిసి ఉంటుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం మామూలు విషయం కాదు. ఆమె మాలాంటి వారికి స్ఫూర్తి.

- సోనికా సాయి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి


అనుకున్నది సాధిస్తుంది

2012 నుంచి మూడేళ్ల పాటు గోపిచంద్‌ అకాడమీలో కలసి సాధన చేశాను. నా కంటే ఏడాది సీనియర్‌. గేమ్‌ను బాగా పికప్‌ చేసింది. డిఫెన్స్‌, అఫెన్స్‌ రెండూ బాగా ఆడుతుంది. మున్ముందు మరిన్ని పతకాలు సాధించే సత్తా సింధుకు ఉంది. తాను అనుకున్నది తప్పకుండా సాధిస్తుంది.

- గంగాధరరావు, అంతర్జాతీయ క్రీడాకారుడు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని