తీరంలో అప్రమత్తం
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

తీరంలో అప్రమత్తం


టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: నాగార్జున సాగర్‌ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్న క్రమంలో కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, నదీపరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నదీపరివాహక ప్రాంతాలు, గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి ఐదు లక్షల క్యూసెక్యుల వరదనీరు సాగర్‌ నుంచి దిగువకు వదిలే అవకాశం ఉందన్నారు. ఈ నీరు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రవహిస్తున్నందున నదికి సమీపంలో ఉన్న గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల, మాచవరం, గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ డివిజన్‌లు, మండలాల్లోని అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

గతంలో గండ్లు పడిన ప్రాంతాలను పర్యవేక్షించండి.. కృష్ణానది వరద నీటి ఉద్ధృతికి గతంలో కరకట్టకు గండ్లు ఏర్పడిన ప్రాంతాలను జలవనరులు, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బృందంగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గండ్లు పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సంచులు ఇతర సామగ్రి, కూలీలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చేపలు పట్టేవారిని, ఈతకు వెళ్లేవారిని, పశువులను మేపేవారిని నది వైపు వెళ్లకుండా చూడాలన్నారు. ముంపునకు గురయ్యే పంట పొలాల్లో సస్యరక్షణ చర్యలకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీలు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవలకు ఏర్పాట్లు చేయాలని, పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను, సమీపంలోని పీహెచ్‌సీల్లో వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు.

* జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ వరదనీటి ఉద్ధృతిని పర్యవేక్షించే ముంపు, లోతట్టు మండలాల అధికారులకు నిరంతరం సమాచారం అందించేలా జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లోనూ, ఆయా రెవెన్యూ డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేసీ పి.ప్రశాంతి, జలవనరుల శాఖ ఎస్‌ఈ బాబూరావు, నాగార్జునసాగర్‌ కెనాల్‌ ఎస్‌ఈ గంగరాజు, పులిచింతల ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రమేష్‌బాబు, కృష్ణా రివర్‌ కన్జర్వేటర్‌ ఈఈ స్వరూప్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని