గుంటూరు చర్చిలో రెండు వర్గాల బాహాబాహీ
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

గుంటూరు చర్చిలో రెండు వర్గాల బాహాబాహీ


గుంటూరు ఈస్ట్‌ ప్యారీస్‌ చర్చిలో వాగ్వాదానికి దిగిన బిషప్‌ పరదేశిబాబు వర్గీయులు, బిషప్‌ ఏలియా అనుచరులు

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు పాతబస్టాండ్‌ సమీపంలోని ఈస్ట్‌ ప్యారిస్‌ చర్చి పాలన అంశంలో బిషప్‌ పరదేశిబాబు, బిషప్‌ ఏలియా వర్గాల పాస్టర్లు, అనుచరులు బాహాబాహీకి దిగారు. ఉదయం 11 గంటల సమయంలో చర్చిలో ఆరాధన చేసే హక్కుపై పరదేశిబాబు వర్గానికి చెందిన పాస్టర్‌ దేవసహాయం, ఏలియా వర్గానికి చెందిన పాస్టర్‌ మోహన్‌బాబుల మధ్య వివాదం మొదలైంది. ఇరువర్గాల వారు కుర్చీలతో పరస్పర దాడులకు దిగారు. దీంతో కొత్తపేట పోలీసులు వచ్చి హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా పాస్టర్‌ దేవసహాయం మాట్లాడుతూ ఈస్ట్‌ ప్యారిస్‌ చర్చి పాస్టర్‌గా సేవలు చేయాలని పరదేశిబాబు తనను నియమించారని తెలిపారు. ఆదివారం ఉదయం ఆరాధన సమయంలో పాస్టర్‌ మోహన్‌రావు, అతని సహాయ పాస్టర్లు, మద్దతుదారులు చర్చిలో ప్రవేశించి తమపై దాడులకు పాల్పడ్డారన్నారు. పాస్టర్‌ జాషువా మాట్లాడుతూ ఆరాధన సమయంలో ఏలియా వర్గానికి చెందిన కొందరు రౌడీలు చర్చిలోకి ప్రవేశించి తమపై దాడులకు దిగి, దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈఎల్‌సీ సంస్థకు సంబంధం లేని వ్యక్తులు సంస్థలో ప్రవేశించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బావమరిది బ్రదర్‌ అనిల్‌ అండ తమకు ఉందని, చర్చిని ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. వైకాపా 12వ డివిజన్‌ అధ్యక్షురాలు వసంతకుమారి మాట్లాడుతూ కర్ణాటక నుంచి వచ్చిన కొందరు యువకులు చర్చిలో అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, వారు పదే పదే బ్రదర్‌ అనిల్‌ పేరు చెబుతూ బెదిరిస్తున్నారన్నారు. వైకాపాకి చెందిన తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. పాస్టర్‌ మోహన్‌బాబు మాట్లాడుతూ బిషప్‌ ఏలియా తనను ఈస్ట్‌ ప్యారిస్‌ చర్చికి ఇన్‌ఛార్జిగా నియమించారని, మూడు వారాలుగా తనను, తన వర్గానికి చెందిన పాస్టర్లను చర్చిలోకి రానివ్వకుండా అడ్డుకొంటున్నారన్నారు. ఆదివారం ఆరాధన చేసేందుకు చర్చిలోకి వెళ్లగా పరదేశిబాబు వర్గీయులు తమపై దాడికి పాల్పడ్డారని.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లిపోయారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తపేట ఎస్‌ఐ నరసింహా సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని