అతివలకు ఆసరా!
eenadu telugu news
Published : 02/08/2021 04:24 IST

అతివలకు ఆసరా!

రెండో విడత అమలుకు కసరత్తు
మచిలీపట్నం, న్యూస్‌టుడే

డ్వాక్రా మహిళలు 2019 ఏప్రిల్‌ 11 నాటికి తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో వైఎస్సాఆర్‌ ఆసరా పథకం ద్వారా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం గతేడాది మొదటి విడత నిధులు జమ చేసింది. వచ్చే నెలలో రెండో విడత జమ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో పలు మార్పులు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మెప్మా, డీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం 73,344 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఈ పథకం ద్వారా గతేడాది లబ్ధి చేకూరింది. డీఆర్‌డీఏ పరిధిలో 5,87,250 మంది, మెప్మా ఆధ్వర్యంలో 1,58,123 మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ ఏడాది కూడా అదే విధంగా లబ్ధి పొందనున్నారు.

ఆసరా పథకంలో భాగంగా అందించే రుణమాఫీ సాయాన్ని తొలుత నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని భావించారు. దీనిలో భాగంగా ఆయా సంఘాల్లోని సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా సంఖ్యలు కూడా సేకరించారు. చివరిలో పొదుపు ఖాతాలకు జమ చేశారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల బ్యాంకులు స్వయంసహాయక సంఘాల అప్పులకు ఆ సాయాన్ని జమ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి  అలాంటివి పునరావృతం కాకుండా సంఘాల్లోని సభ్యుల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. డీఆర్‌డీఏ సిబ్బంది గ్రామాలవారీగా సంఘాల్లోని సభ్యులతో సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు.

బయోమెట్రిక్‌ తప్పనిసరి : రుణమాఫీ సాయం జమ చేసేందుకు గతేడాది సామాజిక వర్గాల వారీగా సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా సంఖ్యలు మాత్రమే తీసుకున్నారు. ఈ ఏడాది కొవిడ్‌తో పాటు పలు అనారోగ్య సమస్యలతో చాలామంది చనిపోయారు. కొందరు సభ్యులు రెండు, మూడు సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడేందుకు వెళ్లినప్పుడు అక్కడి సంఘాల్లో చేరడం, అంతకు ముందు సంఘాల్లో కూడా పేర్లు నమోదై ఉన్నవారున్నారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న సభ్యుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి వేలిముద్రలు వేస్తున్నారు.


త్వరితగతిన ప్రక్రియ పూర్తి

ఆసరా పథకం రెండోవిడత అమల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల వివరాల సేకరణతో పాటు బయోమెట్రిక్‌ తీసుకుంటున్నాం. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం కింద లబ్ధి పొందాలన్నా బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఈసారి సాయం జమ అయిన తరవాత లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రం అందించేలా ఏర్పాట్లు చేశాం. లబ్ధిదారులంతా అవగాహనతో వివరాలు అందించి సహకరించాలని కోరుతున్నాం.

- శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ


డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని సంఘాలు: 56,869
తీసుకున్న మొత్తం రుణాలు: రూ.2,067.44 కోట్లు
మొదటి విడత జమయిన మొత్తం: రూ.516.72 కోట్లు

మెప్మా పరిధిలోని సంఘాలు: 16,441
తీసుకున్న మొత్తం రుణాలు : రూ.583.17 కోట్లు
మొదటి విడత జమయిన సాయం: రూ.145.86 కోట్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని