ఆదాయం అంతంతే..!
eenadu telugu news
Published : 04/08/2021 04:08 IST

ఆదాయం అంతంతే..!

28.5 శాతం అర్జీలకు మోక్షం

ఏఎంఆర్డీఏ ఆశలు అడియాశలు

ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు

ఈనాడు, అమరావతి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార గడువు జులై 31తో ముగిసింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని భావించిన ఏఎంఆర్డీఏకు నిరాశే ఎదురైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా కొద్దిగానే పరిష్కారానికి నోచుకున్నాయి. జీవోలో ఇచ్చిన విధంగా ప్రక్రియ సుదీర్ఘంగా సాగడంతో ఎక్కువ దరఖాస్తులకు ఆమోదం లభించలేదు. వ్యక్తిగత ప్లాట్ల యజమానులు నష్టపోకుండా కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. దీని వల్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సంఖ్య కొంత వరకు ఫర్వాలేదనిపించింది. క్షేత్రస్థాయిలోని అనుమతి లేని అన్ని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అర్జీలు వస్తే ఆదాయం పెద్ద మొత్తంలో సమకూరేది.

123 లేఅవుట్లు, 1,559 ప్లాట్లకు ఆమోదం

ఏఎంఆర్డీఏ పరిధిలోకి వచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రాంతాలను అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 244 దరఖాస్తులు అందాయి. వీటిలో 123 లేఅవుట్లను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు తేలడంతో అనుమతులు మంజూరు చేశారు. రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. సుమారు 2వేల వరకు ఉండొచ్చని అంచనా. కానీ క్రమబద్ధీకరణ విషయానికి వచ్చే సరికి అందిన దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 5,458 అర్జీలు వచ్చాయి. 2007లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌లో ఆమోదం పొందిన లేఅవుట్లలో ఇంకా క్రమబద్ధీకరించుకోని ప్లాట్ల అర్జీలు కూడా ఇప్పుడు వచ్చాయి. ఇందులో సగం విజయవాడ, గుంటూరు జోన్ల నుంచే అందాయి. మొత్తం వచ్చిన వ్యక్తిగత ప్లాట్ల అర్జీల్లో 1,559 పరిష్కారం అయ్యాయి. ఇందులో 911 మంది యజమానులు నిర్దేశిత రుసుము చెల్లించారు. కనీస ప్రమాణాలు లేని 107 ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను తిరస్కరించారు. పరిష్కారమైన వాటి ద్వారా రూ. 27.24 కోట్ల మేర ఆదాయం ఏఎంఆర్డీఏకు సమకూరింది.

కారణాలు అనేకం

* వ్యక్తిగత ప్లాట్ల దరఖాస్తుల పరిశీలన కూడా సంబంధిత లేఅవుట్‌ నమూనాతో ముడిపడి ఉంది. ముందుగా దాని ప్లాన్‌ను తయారు చేసిన అనంతరమే పరిశీలించాల్సి ఉంది. దీంతో పరిశీలన ప్రక్రియలో జాప్యం జరిగింది. అనుమతి లేని లేఅవుట్ల సమాచారం ఏఎంఆర్డీఏ వద్ద లేదు. ఇందుకు ఈసీలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ వివరాలను క్రోడీకరించి, ఒక్కొక్క ప్లాట్‌ వివరాలు సమకూర్చుకుని తుది నమూనాను సిద్ధం చేశారు. దీనికి కమిషనర్‌ ఆమోదముద్ర వేసిన అనంతరం సంబంధిత పంచాయతీ కార్యాలయంలో అభ్యంతరాల స్వీకరణ కోసం వివరాలను ఉంచారు. అనంతరం అభ్యంతరాలు రాని వాటికి ఆమోదం తెలిపారు. ప్రతి దరఖాస్తుకు చాలా సమయం పట్టడంతో ఎక్కువ పరిష్కారం కాలేదు.

* కొవిడ్‌ రెండో దశలో చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. దీని వల్ల వైద్య ఖర్చులు పెరిగి, ఆర్థికంగా చితికిపోయారు. ఈ ప్రభావం ఆమోదం పొందిన దరఖాస్తులపై కూడా పడింది. వ్యక్తిగత ప్లాట్ల దరఖాస్తుల్లో 58.5 శాతం మంది మాత్రమే డబ్బు చెల్లించారు. మిగిలిన వారు ఇంకా డబ్బు కట్టలేదు. ఇది కూడా ఆదాయం తగ్గడానికి కారణమైంది.

* చాలా లేఅవుట్లలోని ప్లాట్ల క్రయ విక్రయాలకు సంబంధించి ఈసీలు దొరకలేదు. వీటి పరిశీలన సాధ్యం కాలేదు. ఫలితంగా వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 28.5 శాతమే పరిష్కారానికి నోచుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని