ఆర్బీకేలు... మినీ బ్యాంకులు
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

ఆర్బీకేలు... మినీ బ్యాంకులు

బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా సేవలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

మూలపాడులో సేవలు ప్రారంభిస్తున్న వ్యవసాయాధికారిణి శైలజ

గ్రామీణులకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఏటీఎంలు అందుబాటులో లేనందున నగదు జమ చేయాలన్నా... తీసుకోవాలన్నా.. బదిలీ చేయాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయలేని వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఆర్‌బీకేల్లో బ్యాంకు సేవలు అందిస్తే వ్యయప్రయాసలు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం భావించింది. జిల్లాలోని 887 రైతు భరోసా కేంద్రాల్లో వివిధ బ్యాంకులకు చెందిన బిజినెస్‌ కరస్పాండెంట్లు (బీసీ) బ్యాంకింగ్‌ సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది.

సమయాలు తెలుపుతూ...

ప్రస్తుతం బ్యాంకులు లేని గ్రామాలకు బీసీలు వెళ్లి ఆర్థిక సేవలు అందిస్తున్నారు. ఇకపై వారిని ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంటారు. రోజుకు కనీసం రెండు గంటలపాటు వారు అక్కడ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీసీలకు బ్యాంకులు అవసరమైన యంత్ర సామగ్రి అందించాయి. బీసీల ద్వారా రూ.10 వేల వరకు నగదు జమ చేయవచ్చు. రూ.20 వేలు తీసుకోవచ్చు. నగదు బదిలీ మాత్రం రూ.10 వేలకే పరిమితం చేశారు. ప్రస్తుతం ఒకటి రెండు ఆర్‌బీకేలకు కలిపి ఒకరిని నియమించారు. తరువాత అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేపడతారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 804 మంది బీసీలు విధులు నిర్వహిస్తున్నారు. వారు ఆర్‌బీకేల్లో బ్యాంకు సేవలు అందించడానికి లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజరు(ఎల్‌డీఎం) ఏర్పాట్లు పూర్తి చేశారు. బీసీలను ఆర్‌బీకేలతో మ్యాపింగ్‌ పూర్తి చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచే పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఎల్‌డీఎం మార్గదర్శకాలు పంపారు.

* మూలపాడు ఆర్‌బీకేలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారిణి డి. శైలజ బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించారు. కాచవరం, కేతనకొండ, కొటికలపూడి, దాములూరు, చిలుకూరు, మూలపాడు గ్రామాల ప్రజలు మూలపాడు ఆర్‌బీకేలో బ్యాంకు సేవలు పొందవచ్చునని ఆమె వివరించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చెందిన బీసీ దుర్గాభవానీ సేవలు అందిస్తారని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని