రెండో విడత రేషన్‌ తీసుకోవాల్సిందే!
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

రెండో విడత రేషన్‌ తీసుకోవాల్సిందే!

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే

జిల్లాలో రెండో విడతగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పీఎంజీకేఏవై బియ్యంను కార్డుదారులంతా తప్పనిసరిగా తీసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత నెలలో తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సరకులను జిల్లాలో 93 శాతం మేర తీసుకున్న కార్డుదారులు, రెండో విడత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యంను 81 శాతం మేర మాత్రమే తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ శాతం తగ్గిపోవడంతో దీనికి గల కారణాలను అధికారులు బేరీజు వేసే పనిలో ఉన్నారు.

ఇదీ పరిస్థితి

ఈ నెల 16వ తేదీ తర్వాత నుంచి జిల్లాలో రెండో విడతగా పీఎంజీకేఏవై పథకంలో భాగంగా రేషన్‌ డిపోల ద్వారా బియ్యం పంపిణీ జరగనుంది. ఆ బియ్యంను కూడా తప్పనిసరిగా కార్డుదారులు తీసుకునేలా చూడాలని ఇప్పటికే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్‌ డీలర్లు, ఎండీయూ యూనిట్ల నిర్వాహకులు, వీఆర్వోలు, వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత సాగే ఇంటింటి సరకుల పంపిణీ సమయంలోనే ప్రతి కార్డుదారుకు ఈ విషయం చెప్పాలని, గత నెలలో రెండో విడత బియ్యం తీసుకోని కార్డుదారులు ఎందుకు బియ్యం తీసుకోలేదో వివరాలు తెలుసుకోవాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది.

మొత్తం బియ్యం కార్డులు  13,05,118
గత నెలలో రెండో విడత పంపిణీ చేసిన కార్డులు  10,32,765
రేషన్‌ డిపోలు  2,353
ఎండీయూ యూనిట్లు817

సరకులు తీసుకోని కార్డుల పరిశీలన

ఆగస్టులో రెండో విడత బియ్యంను కార్డుదారులంతా తప్పని సరిగా తీసుకోవాలని, తీసుకోని లబ్ధిదారుల కార్డులను విచారణ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు వాలంటీర్లు, డీలర్లు, ఎండీయూ నిర్వాహకులు, వీఆర్వోలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. విచారణ అనంతరం అనర్హత ఉన్న కార్డులకు రాబోయే నెలలో సరకుల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని, ఈ విషయాన్ని అవసరమైతే గత నెలలో బియ్యం తీసుకోని కార్డుదారులకు చెప్పాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆదేశాలు బేఖాతరు

ఇది ఇలా ఉండగా తప్పనిసరిగా ఎండీయూ యూనిట్ల నిర్వాహకులు ఇంటింటికీ వెళ్లి సరకులు ఇవ్వాలని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఆయా ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎండీయూ నిర్వాహకులు వీధిలో ఒకచోట వాహనాన్ని నిలిపితే అక్కడకే కార్డుదారులు వెళ్లి సరకులు తీసుకోవాల్సి వస్తోందని, ఇంటింటికీ సరకుల పంపిణీ సక్రమంగా అమలు కావడం లేదని వాపోతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి సరకులు ఇవ్వాలని అధికారులు చెబుతున్నా ఎండీయూ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని ఆక్షేపణలు వస్తున్నాయి. ఎండీయూ యూనిట్ల వద్దకే కార్డుదారులు వెళ్లి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి. 

నిబంధనలు పాటించకపోతే చర్యలు 

ఎండీయూ వాహనాలు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సరకులు ఇవ్వాల్సిందే. వీధి చివర నిలిపి సరకులు పంపిణీ చేసే ఎండీయూ యూనిట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.ఈ నెలలో రెండో విడత బియ్యం పంపిణీ కూడా ప్రతి కార్డుదారు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు చేపట్టాం.

-నారాయణరెడ్డి, జిల్లా పౌర సరఫరాలశాఖ ఇన్‌ఛార్జి అధికారి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని