నాలుగోస్సారి...
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

నాలుగోస్సారి...

రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులకే దిక్కు లేదు !

టెండర్లకు మళ్లీ ఆహ్వానం

అధ్వానంగా తేలప్రోలు- ఉయ్యూరు రోడ్డు

చిత్రంలో కనిపిస్తున్నది రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌-280). తేలప్రోలు నుంచి ఉయ్యూరు మీదుగా తోట్లవల్లూరుకు వెళ్లే మార్గమిది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా ధ్వంసమైంది. మీటరు లోతు గుంతలు పడింది. ఈ రహదారిలో వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది. కి.మీ. 24.480 నుంచి కి.మీ 28.400 వరకు (4.080 కి.మీ) నిర్వహణకు రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికి దీనికి మూడుసార్లు టెండర్లు పిలిచారు. కానీ గుత్తేదారులు ముందుకు రాలేదు. నాలుగో సారి మళ్లీ టెండర్‌ పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈనాడు, అమరావతి

‘నిధులు మంజూరు చేశామంటారు. బిల్లులు చేయరు. వారి చుట్టూ తిరగాలి. ‘సంప్రదాయాలు’ సరేసరి. కనీసం 10 శాతం సమర్పించుకోవాలి. ప్రస్తుతం డీజిల్‌, కంకరతో సహా అన్ని ధరలు పెరిగాయి. అందులో మిగిలేదేమీ ఉండదు. ముందు రూ.కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోవాలి. ఎందుకొచ్చిన గొడవ.. ఎవరో యంత్రాలు ఖాళీగా ఉండకుండా ఉండే పెద్ద కాంట్రాక్టర్లు చేస్తారు..’ అని ఓ అర్‌అండ్‌బీ గుత్తేదారు వ్యాఖ్యానించారు.

జిల్లాలో రహదారుల మరమ్మతుల పనులకు గుత్తేదారులు మందుకు రావడం లేదు. ప్రభుత్వ ఖజానా పరిస్థితిని చూసి బిల్లులు రావనే ఉద్దేశంతో టెండర్లను దాఖలు చేయడం లేదు. జిల్లాలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధాన రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్వహణ పనులకే గుత్తేదారులు రావడం లేదంటే పరిస్థితి అంచనా వేయవచ్చు. జిల్లాలో మొత్తం రూ.181.45 కోట్లతో 81 పనులకు టెండర్లను పిలిచారు. గుత్తేదారులు పోటీ పడతారని లేదా సర్దుబాటు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితి సరిగా లేదని, ఇప్పటికే పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోటీ పడి పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. రహదారుల నిర్వహణ టెండర్లకు గుత్తేదారులు సిండికేట్‌గా మారి తలా ఒక పని పంచుకోవడం అనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుతం జిల్లాలో మూడు సార్లు పిలిచినా ఒక్క టెండర్‌ దాఖలు కాలేదు. నాలుగో సారి టెండర్‌ పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వయంగా మంత్రులు పిలిచినా టెండర్లను వేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలిసింది.

* గత రెండేళ్లుగా రహదారుల నిర్వహణ పూర్తిగా వదిలేశారు. తట్టమట్టి పోసిన సందర్భం లేదు. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మీదుగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం వాహనాలు నడపలేమని మొత్తుకుంటున్నారు. తుక్కు బస్సులు, గతుకుల రహదారులపై వెళ్తే పార్టులు ఊడిపోతున్నాయని చెబుతున్నారు.

* పేరుకు అవి రాష్ట్ర రహదారులే కానీ ప్రతి రెండు, మూడు మీటర్లకు మీటరు లోతు గుంత ఉంటుంది. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి. గన్నవరం- పుట్టగుంట రోడ్డు, విజయవాడ నూజివీడు రోడ్డు, జగ్గయ్యపేట వైరా రోడ్డు, జగ్గయ్యపేట ముక్త్యాల రోడ్డు, మంటాడ - లంకపల్లి రహదారిపై నరకం చూస్తున్నారు. ఈ రహదారుల నిర్వహణ కోసం రూ.31.83 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

మరోసారి టెండర్లు..!

ప్రధాన రహదారులు, జిల్లాలో ఉన్న రాష్ట్ర రహదారుల నిర్వహణకు ఇప్పటికి మూడు సార్లు టెండర్లను పిలిచాం. తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం అంచనాలు వేశాం. కానీ టెండర్లు దాఖలు కాలేదు. గుత్తేదారులు ముందుకురాలేదు. గత మే నెల నుంచి నిర్వహణ కోసం టెండర్లను పిలుస్తున్నాం. వర్షాల వల్ల రహదారులు మరింత దెబ్బతిన్నాయి. నాలుగోసారి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నాం.  ఈ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలోనే టెండర్లను పిలుస్తున్నాం. ఎన్‌డీబీ నిధులతో పిలిచిన టెండర్ల పనులు ప్రారంభమయ్యాయి. మరీ దారుణంగా ఉన్న ప్రాంతాల్లో గుంతలను శాఖ పరంగా పూడుస్తున్నాం.

బందరు డివిజనులో

* మచిలీపట్నం నూజివీడు రహదారి, భీమవరం గుడివాడ రోడ్డు, గుడివాడ-చల్లపల్లి- కొత్తపాలెం మార్గం, వడ్లమన్నాడు-పెదలంక రోడ్డు, మచిలీపట్నం నూజివీడు కల్లూరు రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి. వీటికి రూ.19.37 కోట్లు కేటాయించారు. కానీ స్పందన లేదు.

మైలవరం పరిధిలో..

* విస్సన్నపేట-లక్ష్మీపురం, దిగవల్లి- వలసపల్లి రోడ్డు, నూజివీడు-గంపలగూడెం రోడ్డు, విస్సన్నపేట వెలగాలపల్లి రోడ్డు, హనుమాన్‌ జంక్షన్‌ విస్సన్నపేట రోడ్డు, జమలాపురం- చంద్రగూడెం రోడ్డు, విస్సన్నపేట- సత్తుపల్లి రోడ్డు రాష్ట్ర రహదారులుగా ఉన్నాయి. వీటికి రూ.19.02 కోట్లు మంజూరు చేశారు.

బిల్లులు వస్తాయో రావో..

* జిల్లా ప్రధాన రహదారులు మరీ దారుణగా ఉన్నాయి. విజయవాడ నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాలు కనీసం గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు. జిల్లాలో 61 మార్గాల్లో నిర్వహణ పనులు చేయాల్సి ఉంది. కొన్ని ప్యాచ్‌ వర్క్‌ చేయాల్సి ఉంది. కొన్ని పటిష్ట పర్చాల్సి ఉంది. వీటికి రూ.111.23 కోట్లు కేటాయించారు. కానీ బిల్లులు వస్తాయో రావో అన్న అనుమానంతో గుత్తేదారులు టెండర్లను దాఖలు చేయలేదు.

-శ్రీనివాసమూర్తి, ఎస్‌ఈ, ర.భ.శాఖ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని