ఇంటికెళ్తే దొరకవేమో..
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

ఇంటికెళ్తే దొరకవేమో..

బ్లాక్‌ ఫంగస్‌ మందుల కోసం రోగుల ఆందోళన

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

ఔషధాల కోసం వేచి ఉన్న రోగుల సహాయకులు

కొవిడ్‌ రెండో దశ కళ్ల ముందే ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ భయాందోళనల నుంచి కోలుకోక ముందే బ్లాక్‌ ఫంగస్‌ వణికిస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నా కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు మందుల కొరత వీరిని మరింత వేధిస్తోంది. చికిత్స అనంతరం కూడా వీటిని వాడాల్సి ఉండడం.. సరిపడా అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ఈ చికిత్స కోసం గుంటూరు సర్వజనాసుపత్రికి ఎందరో వచ్చారు. ఇంటికెళ్తే దొరకవేమో అని ఇక్కడ చికిత్స పొందిన బాధితులతో పాటు సహాయకులు మందుల కోసం సర్వజనాసుపత్రి వద్ద రేయింబవళ్లు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.
సర్వజనాసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అవసరమైన యాంటీఫంగల్‌ టాబ్లెట్లు అందుబాటులో లేకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల లక్షణాలను అనుసరించి అవసరాలకు సరిపడినట్లు ఔషధాలు ఇస్తేనే త్వరగా బ్లాక్‌ ఫంగస్‌ నుంచి బయటపడతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో రోగుల బంధువులు మందుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ పడిగాపులు పడాల్సి వస్తోంది.

ఒకటి లేదా రెండు రోజులకే..

రోగులందరికీ ఔషధాలు అవసరమైన మేర అందుబాటులో లేనందున ఒకటి, రెండు రోజులకు సరిపోను ఇస్తున్నారు. దీంతో కొందరు రోగుల బంధువులు నిత్యం సర్వజనాసుపత్రికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి రోజూ ఉదయమే వచ్చి రోగికి సంబంధించిన దస్త్రాన్ని ఫార్మసీ విభాగంలో ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఆ వివరాలను నమోదు చేసుకుని ఉంచుతారు. అనంతరం కేంద్ర ఔషధ భాండాగారం నుంచి మందులు వచ్చిన అనంతరం ఒక్కొక్కరిని పిలిచి మందులు ఇచ్చి పంపుతున్నారు. దీంతో జీజీహెచ్‌ చుట్టూ రోజూ తిరగలేక బాధిత కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇతర జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఈ మందుల కోసం తరలివస్తుండటం గమనార్హం. జీజీహెచ్‌లో చికిత్స పొందిన వారంతా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఈ ఔషధాలు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండవని వైద్యులు తెలుపుతున్నారు.

ఇంటికి వెళ్లం

మ్యూకార్‌మైకోసిస్‌ చికిత్స పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నప్పటికీ రోగులు వార్డులోనే ఉంటామని చెబుతుండటం గమనార్హం. నెలకు సరిపోను బిళ్లలు ఇస్తేనే వెళ్తామని అంటున్నారు. దీంతో ఏం చేయాలో వైద్యులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. శస్త్రచికిత్స అనంతరమూ మందులను కొనసాగించాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కనీసం రెండు నెలలైనా ఈ ఔషధాలు వాడాల్సి ఉంటుంది. ఒకసారి ఆసుపత్రి నుంచి వెళ్లిపోతే మందుల కోసం రోజూ ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి ఉంటుందని రోగుల సహాయకులు తెలుపుతున్నారు. అందువల్ల ఆసుపత్రిలోనే ఉంటే కనీసం యాంటీఫంగల్‌ టాబ్లెట్లు అందుబాటులో లేకపోతే ఇంజెక్షన్లు ఇస్తున్నారని తెలుపుతున్నారు.

ఎక్కువ మందులు కావాలని అడిగాం

రోగుల డిమాండ్‌ మేర ఔషధాలు అందుబాటులో లేనందున ఎక్కువ రోజులకు ఇవ్వలేకపోతున్నాం. అధికంగా మందులు కావాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను అడిగాం. కొద్ది రోజుల్లోనే ఎక్కువ మందులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం కొరతను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజుకి 200 నుంచి 300 వరకు టాబ్లెట్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం.

- ప్రభావతి, సూపరింటెండెంట్‌, సర్వజనాసుపత్రి, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని