సహకార బ్యాంకు సంఘాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

సహకార బ్యాంకు సంఘాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి


సమావేశమైన కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్లు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: సహకార బ్యాంకు సంఘాలపై ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకోవాలని ఏపీ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులు, క్రెడిట్‌ సొసైటీల ఫెడరేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. గుంటూరులోని అర్బన్‌ బ్యాంకులో ఛైర్మన్‌ బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. క్రెడిట్‌ సొసైటీ, బ్యాంకుల్లో జరుగుతున్న కార్యకలాపాలు, సమస్యలు, అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంతో కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చి సహకార వ్యవస్థపై దాడి చేస్తుందని, దీనివల్ల సహకార రంగం మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, సమష్టిగా సమస్యను అధిగమించాలని తీర్మానించారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ అత్యధిక సహకార సంస్థలు విభజిత ఏపీలోనే ఉన్నా ఇంత వరకు కమిషనర్‌ స్థాయి అధికారిని నియమించలేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే కమిషనర్‌ను నియమించి పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. సహకార సంఘాలకు నిర్ధిష్టమైన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలోని 46 సహకార అర్బన్‌ బ్యాంకుల్లో 2021, మార్చి నాటికి రూ.10,923.51 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, రూ.7,074.95 కోట్లు రుణాలు ఇచ్చామని, నిల్వ ధనం రూ.487.96 కోట్లు ఉన్నాయని తెలిపారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం సహకార సంస్థల స్వయం ప్రతిపత్తిని, జావాబుదారీతనాన్ని నిర్దేశించిందని, చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని కేంద్రం సహకార రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని విమర్శించారు. ఈ అంశాలపై బుధవారం గుంటూరులోని గ్రాండ్‌ నాగార్జున హోటల్‌లో నిర్వహించే సర్వసభ్య సమావేశంలో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి సహకార రంగాన్ని బతికించుకునేందుకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు, మాజీ ఛైర్మన్‌ మానం ఆంజనేయులు, ఏలూరు అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ అంబికా ప్రసాద్‌, ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ జిలాని, కార్యదర్శి వెంకటరత్నం, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ ముప్పాళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని