ఏఎన్‌ఎంలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
eenadu telugu news
Published : 05/08/2021 06:23 IST

ఏఎన్‌ఎంలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

ఈనాడు-అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు గర్భిణులు, శిశువుల వివరాలను ఆర్సీహెచ్‌ పోర్టల్‌లో తప్పుల తడకగా నమోదు చేసిన ఏఎన్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. స్పందించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జె.యాస్మిన్‌ ఈ తప్పిదాలకు పాల్పడిన ఏఎన్‌ఎంలకు తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశిస్తూ బుధవారం సర్య్కులర్‌ జారీ చేశారు. ఈనెల 1న ‘ఈనాడు’ అమరావతి సంచికలో ‘తప్పుల తడకగా పిల్లల రిజిస్ట్రేషన్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి కమిషనర్‌ స్పందించారు. వెంటనే బాధ్యులను గుర్తించి ఈనెల 9 లోపు తొలుత వారి వివరణలు తెలుసుకోవాలని డీఎంహెచ్‌ఓ జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లకు స్పష్టం చేయడంతో బాధ్యులైన ఏఎన్‌ఎంల్లో కలకలం రేగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ దాకా ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో ఛైల్డ్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలను తప్పుల తడకగా నమోదు చేశారు. దీనివల్ల ఆయా పథకాలు అర్హులకు వర్తించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు, ఒకే పేరుతో పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ ఐడీలు క్రియేట్‌ చేయడం, ఒకే చరవాణి నంబర్‌ను పలువురు లబ్ధిదారులకు చూపటం వంటివి చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 16,763 మంది గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్‌లు చేయగా వాటిల్లో 2451 రిజిస్ట్రేషన్లకు చరవాణి నంబర్లు ఒకేలా ఉన్నాయి. ఒకే ఫోన్‌ నంబరు పలువురు లబ్ధిదారులకు పోర్టల్‌లో నమోదు చేసినట్లు ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. 283 ఖాతాలకు తల్లి పేర్లు ఒకేలా ఉన్నాయి. ఈ వివరాల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, వారిని ఉపేక్షించరాదని కమిషనర్‌ కన్నెర్ర చేయడంతో డీఎంహెచ్‌ఓ చర్యలు దిశగా రంగంలోకి దిగారు. ఈ తప్పిదాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఏ స్థాయిలోనూ గుర్తించలేదు. దీనిపై కూడా త్వరలోనే మరికొందరు హెల్త్‌ సూపర్‌వైజర్లు ఇతర ఉద్యోగులపై చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని