బడి దారిలో విషాదం
eenadu telugu news
Updated : 15/09/2021 02:51 IST

బడి దారిలో విషాదం

లారీ బీభత్సం...

తల్లీకూతురు దుర్మరణం

షేక్‌ అప్సా, హసీనా సుల్తానా (పాత చిత్రాలు)

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రెప్పపాటులో, అందరూ చూస్తుండగానే అతి వేగంగా వచ్చిన ఆ లారీ సృష్టించిన బీభత్సంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పాఠశాల నుంచి కబుర్లు చెప్పుకొంటూ ఇంటికి వెళుతున్న ఆ తల్లీ కుమార్తెలు క్షణాల్లో విగతజీవులుగా మారారు. చూపరులను కంటతడి పెట్టించిన ఈ విషాద ఘటన తెనాలి మార్కెట్‌యార్డు లోపల జరిగింది. మూడో పట్టణ పోలీసులు, మృతుల కుటుంబికులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉడా కాలనీకి చెందిన షేక్‌ బాజి, హసీనా సుల్తానా(34) దంపతులకు ఇరువురు కుమార్తెలు. బాజి పట్టణంలోని షరాఫ్‌బజార్‌లో బంగారపు పని చేస్తారు. పిల్లలిద్దరినీ బాగా చదివించాలన్న తపన వారిది. పెద్ద కుమార్తె ఇక్కడే ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌, రెండో కుమార్తె అప్సా(10) పట్టణ శివారు సుల్తానాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు బడిలో ఆరో తరగతి చదువుతున్నారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో గత వారం నుంచే అప్సా బడికి వెళుతోంది. అప్పటి నుంచి ప్రతి రోజూ తల్లి పాఠశాల ముగిసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై పాపను ఇంటికి తీసుకొస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం సాయంత్రం కూడా ఆమె బడి నుంచి చిన్నారిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఇంటికి పయనమయ్యారు. ఉడా కాలనీకి మార్కెట్‌యార్డు లోపలి నుంచి దగ్గరి దారి ఉంది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం మాత్రమే వెళుతుంది. సాధారణంగా ఆ ప్రాంత వాసులు సమయం కలసి వస్తుందని, ట్రాఫిక్‌ తక్కువగా ఉంటుందని ఈ దారినే వినియోగిస్తారు. హసీనా సుల్తానా కూడా అదే మార్గంలో యార్డులోకి వచ్చారు. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డుకు మారిన క్రమంలో అదే మార్గంలో వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వీరిని ఢీకొట్టి వాహనంతో సహా సుమారు 10 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. తలకు గాయమైన తల్లి కుడి వైపునకు, లారీ మీద నుంచి వెళ్లడంతో కుమార్తె ఎడమ వైపునకు పడిపోయి.. క్షణాల్లో ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనను గమనిస్తున్న యార్డు కార్మికులు హాహాకారాలు చేస్తుండగానే క్షణంలో ఇది జరిగిపోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ప్రమాద స్థలిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్సై సుమన్‌, ఇతర సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని, మృతదేహాలను వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా తల్లీ కుమార్తె తిరుగు పయనంలో మార్గం మధ్యలో కూరగాయలు కూడా కొనుగోలు చేశారు. ప్రమాద స్థలిలో టమోటాలు రోడ్డు మీద పడిపోయి కన్పించాయి. నాలుగు దశాబ్దాల తెనాలి మార్కెట్‌యార్డు చరిత్రలో ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే తొలిసారని, ఈ ఘటన బాధ కలిగించిందని యార్డు అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ చౌకధరల దుకాణాలకు రేషన్‌ బియ్యం తరలించే పని మీద లోడింగ్‌ కోసం యార్డులోనికి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వారు వివరించారు.

లారీ టైరు కిందున్న వాహనం.. పక్కనే తల్లి హసీనా సుల్తానా మృతదేహం


చెల్లిని తీసుకొస్తూ అన్న మృతి

మృతుడు వంశీ (దాచిన చిత్రం)

తాడికొండ, న్యూస్‌టుడే: వారిద్దరూ అన్నాచెల్లెళ్లు. రోజూ కలిసి నాన్నతో ఇంటికి వెళ్లేవారు. ఆరోజు అన్న కళాశాలకు వెళ్లలేదు. తండ్రి వేరే పనిపై బయటకు వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన చెల్లిని తెద్దామని వచ్చిన అన్నను లారీ రూపంలో మృత్యువు పొట్టన బెట్టుకోగా, బాలిక చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు.. తాడికొండ మండలంలోని నిడుముక్కల గ్రామానికి చెందిన రైతు బండి శ్రీను, ఝాన్సీలకు వంశీ (17), కీర్తి అనే ఇద్దరు పిల్లలున్నారు. గుంటూరులోని నారాయణ విద్యా సంస్థల్లో వంశీ ఇంటర్‌ రెండో ఏడాది, కీర్తి పదో తరగతి చదువుతున్నారు. రోజూ తాడికొండ అడ్డరోడ్డు వద్దకు తండ్రి వారిని బైకుపై తీసుకెళ్లి విద్యా సంస్థకు చెందిన బస్సులో ఎక్కించేవారు. అక్కడి నుంచి ఇద్దరూ గుంటూరు వెళ్లేవారు. తిరిగి సాయంత్రం అడ్డరోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉండే నిడుముక్కలలోని తమ ఇంటికి తీసుకొచ్చేవారు. మంగళవారం కీర్తి ఒక్కతేే పాఠశాలకు వెళ్లింది. వంశీ ఇంటి వద్దే ఉన్నాడు. తండ్రి పొలం పనులకు వెళ్లి ఇంకా రాకపోవడంతో చెల్లిని ఇంటికి తీసుకొద్దామని వంశీ ద్విచక్ర వాహనంపై అడ్డరోడ్డు వద్దకు వెళ్లాడు. బస్సు నుంచి దిగిన చెల్లిని బైకుపై ఎక్కించుకొని ఆనందంగా ఇంటికి బయలు దేరారు. ఒక కిలోమీటరు దూరం వెళ్లిన తర్వాత, అమరావతి నుంచి గుంటూరు వెళుతున్న లారీ వారి ద్విచక్ర వాహనాన్ని డీకొంది. వంశీ తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న కిర్తీకి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు 108కు, పోలీసులకు ఫోన్‌ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై విజయ్‌కుమార్‌రెడ్డి అంబులెన్స్‌లో పాపను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంశీ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు చనిపోవడం, మరొకరు చావుబతుకుల్లో ఉండడంతో తల్లిండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. వారు రోదిస్తున్న తీరు అక్కడివారిని కలచివేసింది. కేసు దర్యాప్తులో ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని