2030 నాటికి రైల్వేలో పూర్తి విద్యుదీకరణ
eenadu telugu news
Published : 16/09/2021 03:43 IST

2030 నాటికి రైల్వేలో పూర్తి విద్యుదీకరణ

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : దేశంలోని అన్ని రైల్వేలైన్లను 2030 నాటికి విద్యుదీకరణ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అన్ని రంగాలను తీర్చిదిద్దుతామని రైల్వే ప్రయాణికుల సేవలు, సౌకర్యాల కమిటీ ఛైర్మన్‌ రమేష్‌చంద్ర రతన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ రైల్వే దేశానికి వెన్నెముక వంటిదని చెప్పారు. అన్ని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామని, ప్రయాణికులు స్వచ్ఛత పాటించాలని కోరారు. కొవిడ్‌ సమయంలో భారతీయ రైల్వే చక్కని సేవలు అందించిందని, అదే లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినేదన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రైల్వేలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మోదీ ఏమీ అమ్మటం లేదని, దేశానికి సంబంధించిన రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర వైద్యసేవల విభాగాన్ని తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్‌, ఛైల్డ్‌లైన్‌ అందిస్తున్న సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని