17 నుంచైనా పరీక్షలు జరిగేనా?
eenadu telugu news
Published : 16/09/2021 04:03 IST

17 నుంచైనా పరీక్షలు జరిగేనా?

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో వాయిదాపడిన మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 17 నుంచి జరిగే అవకాశాలు లేవని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏఎన్‌యూ పరిధిలోని దాదాపు 175 బీఈడీ కళాశాలల్లో విద్యార్థుల డిక్లరేషన్లు సక్రమంగా నిర్వహించలేదని, కొన్ని కళాశాలలకు సరైన గుర్తింపు లేదని ఉన్నత విద్యామండలి అధికారులు పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించారు. ఆ కళాశాలల్లో అన్ని అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే పరీక్షలకు తుది అనుమతి ఇచ్చే అవకాశముంది. మిగిలిన రెండు రోజుల్లో ఇన్ని కళాశాలల పత్రాలు పరిశీలించాలంటే అధికారులకు కత్తిమీద సాము వంటిదే. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసే ముందు పరీక్ష భవన్‌ అధికారులు సైతం కళాశాలల పత్రాలు పరిశీలించకుండానే అనుమతిలిచ్చారంటున్నారు. ఇందులో బీఈడీ కళాశాలల యాజమాన్యాలది ఏమేర తప్పు ఉందో.. ఏఎన్‌యూ పరీక్షా భవన్‌ అధికారులదీ అంతే ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండానే కొన్ని బీఈడీ కళాశాలలు పరీక్ష భవన్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్‌ విడుదల చేయించారని వారు పేర్కొంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు అన్ని పత్రాలు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి లోనైన పరీక్షా భవన్‌ సిబ్బంది.. షెడ్యూల్‌ విడుదల చేసి, పరీక్షలు మరో రెండు గంటల్లో ప్రారంభమవుతున్న సమయంలో ఉన్నత విద్యామండలి అధికారులకు ఉప్పందింది. ఎలాంటి అనుమతులు లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యామండలి వీటిని వాయిదా వేయించింది. మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటే కళాశాలల వద్ద అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదో పరిశీలన చేయాలి. ఆ తర్వాతే షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఒకవేశ కళాశాలల వద్ద అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా.. 175 కళాశాలల పత్రాలు పరిశీలించాలంటే కనీసం వారం రోజులైనా పట్టే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని