అవును నిజమే..!
eenadu telugu news
Published : 16/09/2021 04:03 IST

అవును నిజమే..!

అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఆర్పీల తొలగింపు

పొన్నూరు, న్యూస్‌టుడే

మెప్మా సిబ్బంది, బ్యాంకు అధికారిణి కుమ్మక్కై పొదుపు రుణాల పేరిట రూ.37.50 లక్షలు స్వాహా చేశారు. ఈ విషయమై గత నెల 31న ‘ఈనాడు’లో ‘కుమ్మక్కై కాజేశారు..’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనికి స్పందించిన జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటరమణ స్వయంగా పొన్నూరు వచ్చి అక్రమాలకు పాల్పడిన సిబ్బంది, అధికారులను విడివిడిగా పిలిచి విచారించారు. ఇందులో అవకతవకలు జరిగినట్టు సదరు సిబ్బంది అంగీకరించారు. క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టాలంటూ సిటీ మిషన్‌ మేనేజర్‌ జ్యోత్స్నకు పీడీ ఆదేశాలు జారీ చేశారు.

● పొన్నూరు 12వ వార్డులో 32 పొదుపు సంఘాలున్నాయి. సంఘానికి ఇద్దరు సభ్యుల చొప్పున అధికారులు సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ఆర్పీ అరుణకుమారి అక్రమాలకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయిందని, ఆమెను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి ఆ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయడంతో సదరు ఆర్పీని విధుల నుంచి తొలగించినట్టు అధికారులు ప్రకటించారు. ఇక 24, 26 వార్డుల్లో 65 పొదుపు సంఘాలున్నాయి. ఈ సమావేశానికి కూడా ఇద్దరు సభ్యుల చొప్పున పిలిపించారు. ఆర్పీ పద్మజ అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో తేలిందని, ఆమెను కూడా విధుల నుంచి తప్పిస్తున్నట్టు తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఆమెను కూడా విధుల నుంచి తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరు ఆర్పీలను విధుల నుంచి తొలగించినట్టు మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ మేరీజ్యోత్స్న బుధవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పొదుపు సంఘంలో సభ్యులు చేసిన తీర్మాన పత్రాలను స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు.

● 21వ వార్డులో ఆర్పీ వనకుమారి అక్రమాలకు పాల్పడినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేలినప్పటికీ ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించలేకపోయినట్టు సీఈవో జ్యోతి చెప్పారు. ఆ ఆర్పీ ప్రజాప్రతినిధులు, మెప్మా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బ్యాంకులో తీసుకున్న రూ.37.50 లక్షల రుణాలు కూడా సిబ్బంది, బ్యాంకు అధికారిణి తిరిగి చెల్లించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని