ద్వితీయ ఇంటర్‌ పరీక్షకు 0.38 శాతమే హాజరు
eenadu telugu news
Published : 16/09/2021 04:03 IST

ద్వితీయ ఇంటర్‌ పరీక్షకు 0.38 శాతమే హాజరు

126 కేంద్రాల్లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రారంభం

ఏసీ కళాశాల హాలులో పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా 126 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి.. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ద్వితీయ భాష (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం) పరీక్షలు సజావుగా జరిగాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల నుంచి 5.30 వరకు జరిగిన పరీక్షకు 50217 మందికిగాను 0.38 శాతంతో 193 మంది మాత్రమే హాజరైనట్లు ఆర్‌ఐవో జడ్‌.ఎస్‌.రామచంద్రరావు తెలిపారు. ప్రథమ ఏడాది విద్యార్థులకు ఉదయం సెషన్‌లో 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 48032 మందికిగాను 71.1 శాతంతో 34154 మంది హాజరయ్యారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో వచ్చిన మార్కులు ఆధారం చేసుకుని ద్వితీయ ఏడాది విద్యార్థులకు మార్కులు కేటాయించారు. ఈ మార్కులు పెరగవన్న ఉద్దేశంతో కొందరు, మరికొందరు విద్యార్థులు ఇప్పటికే డిగ్రీ, బీటెక్‌, ఇతర రాష్ట్రాలకు చదువుకునేందుకు వెళ్లడం తదితర కారణాలతో హాజరు శాతం తక్కువగా నమోదై ఉండవచ్చని భావిస్తున్నారు. పరీక్షల్లో ఏవిధమైన మాల్‌ప్రాక్టిస్‌ కేసులు నమోదు కాలేదన్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు సరిగా అమలు చేయలేదని విమర్శలు వచ్చాయి. పలకలూరురోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాలలో సిబ్బంది మాస్క్‌లు ధరించకుండా ఉండటం చూసి విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ప్రశ్నించారు. గురువారం నుంచైనా కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని