బంగారం చోరీ కేసు తిరగదోడండి
eenadu telugu news
Published : 16/09/2021 05:14 IST

బంగారం చోరీ కేసు తిరగదోడండి

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో విశాల్‌గున్నీ ఆదేశం


ఫిర్యాదులు స్వీకరించి వివరాలు నమోదు చేసుకుంటున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : అచ్చంపేటకు చెందిన ఓ బంగారు నగల వ్యాపారి తన దుకాణంలో 2014లో దొంగలుపడి కిలో బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బుధవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఈక్రమంలో 2018లో తన కేసును మూసివేసినట్లు తెలిపారని వాపోయాడు. స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. అంతపెద్ద మొత్తంలో చోరీ జరిగితే ఆ కేసులో దొంగను పట్టుకొని సొత్తును ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. గత అధికారులు కేసు మూసివేశారని ప్రస్తుత సీఐ తెలపడంతో ఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆ కేసును రీ ఓపెన్‌ చేసి దర్యాప్తు చేయాలన్నారు. కార్యక్రమానికి పలు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

*● వేమూరుకు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి తన ద్విచక్రవాహనం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసి నెలన్నర అవుతున్నా కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

* సత్తెనపల్లికి చెందిన మహిళ ఫోన్‌ చేసి తన తల్లిని కుమారులు కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారని వాపోయారు. స్పందించిన ఎస్పీ వెంటనే సీఐతో మాట్లాడారు. కాగా మగపిల్లలు, ఆడపిల్లలు ఆస్తి విషయంలో వాళ్ల అమ్మను ఇబ్బంది పెడుతుంటే కౌన్సెలింగ్‌ ఇచ్చానని, ఆ వృద్ధురాలు ఇంట్లో ఉండేలా మాట్లాడానని సీఐ తెలిపారు. సీనియర్‌ సిటిజన్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఎస్పీ ఫిర్యాదుదారుతో మాట్లాడుతూ పోలీసుల పరంగా అన్నిరకాల చర్యలు తీసుకున్నారని, ఆస్తుల విషయం కుటుంబ సభ్యులు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు.

* క్రోసూరుకు చెందిన యువతి ఫోన్‌ చేసి తన మేనమామ కుమారుడు ప్రేమిస్తున్నా...పెళ్లి చేసుకుంటానని ఏడేళ్లుగా నమ్మించి ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలిపింది. ఎస్పీ స్పందిస్తూ వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

* దిల్లీ నుంచి ఓ మహిళ ఫోన్‌ చేసి దుగ్గిరాలలోని తన తల్లి గతవారం డయల్‌ యువర్‌ ఎస్పీలో స్థల వివాదమై ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

* గుంటూరుకు చెందిన మహిళ మాట్లాడుతూ తన కుమారుడికి పెళ్లి అయిన 15 రోజుల్లోనే కోడలు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని వాపోయింది. స్పందించిన ఎస్పీ అర్బన్‌ పోలీసులతో మాట్లాడి విచారించి చర్యలు తీసుకోమంటానని తెలిపారు.

* గుంటూరు బ్రాడీ పేటకు చెందిన యువకుడు మాట్లాడుతూ ఓ పెట్రోలు బంకులోని సీసీ కెమెరాల్లో తాను కనిపించానంటూ అరండల్‌పేట పోలీసుస్టేషన్‌కు తీసుకు వెళ్లి ఫొటోలు తీసిన ఎస్సై రవీంద్ర తనను కొట్టి జేబులోని పర్సు లాక్కొని పంపించారని వాపోయాడు. ఎస్పీ వెంటనే అర్బన్‌ ఎస్పీకి ఫోన్‌ చేసి సదరు యువకుడిని కొట్టి పర్సు తీసుకోవడంపై విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని