ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?: దేవినేని
eenadu telugu news
Published : 16/09/2021 05:18 IST

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?: దేవినేని


తెదేపా నాయకులతో కలిసి నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి దేవినేని, మాజీ ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కర్‌ తాగి ప్రాణాలు పోతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం నందిగామ తెదేపా కార్యాలయంలో ఇంజినీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకు ప్రముఖ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి దేవినేని పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు కోసం తెదేపా కార్యక్రమంలో భాగంగా వైకాపా రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. అనంతరం దేవినేని ఉమా విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫీయా లెక్కలు తాడేపల్లి తప్ఫ. ఏ అధికారికి తెలియనివ్వట్లేదని అన్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తూ లారీ రూ.లక్షకు విక్రయిస్తూ, రూ.వేల కోట్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న, పెద్ద కలిపి 40 నదులు ఉంటే అన్ని చోట్లా ఇసుక తవ్వి జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలోను పెద్దఎత్తు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఇంజినీర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనీల్‌యాదవ్‌ కనిపించట్లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత వరకు వచ్చిందో చెప్పే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిగా గాలికోదిలేశారన్నారు. పత్తి, మిర్చి రైతులకు పంటల బీమా పథకం రాలేదన్నారు. సుబాబుల్‌కు రూ. ఐదు వేలు ఇస్తామని సీఎం జగన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు రూ. వెయ్యి రావట్లేదని ఉమా చెప్పారు. అసెంబ్లీలో సుబాబుల్‌పై చప్పట్లు కొట్టిన నందిగామ, మైలవరం ఎమ్మెల్యేలు ఏమైయ్యారని విమర్శించారు. రైతు కోసం తెదేపా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలా ప్రసాద్‌, పార్టీ నాయకులు యేచూరి రామకృష్ణ, వీరంకి వీరాస్వామి, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని