పాఠశాలల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

పాఠశాలల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన

3560 స్కూళ్లలో ఎస్‌ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు


మేడికొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్న హెచ్‌ఎం జయప్రద, ఉపాధ్యాయుడు స్టీఫెన్‌

ఈనాడు-అమరావతి: జిల్లాలో పాఠశాలల్లో తల్లిదండ్రుల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 3560 పాఠశాలల్లో ఓటర్ల జాబితాను ప్రధానోపాధ్యాయులు ప్రదర్శించారు. రెండేళ్ల కాల పరిమితికి జరిగే ఎన్నికలకు జిల్లా సమగ్రశిక్ష అభియాన్‌, జిల్లా విద్యాశాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ప్రతి పాఠశాలలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలతో కూడిన జాబితాను పాఠశాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రదర్శించారు. వీటిపై ఈ నెల 19 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 22న పోలింగ్‌ జరుగుతుంది. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా ఎన్నికలు జరుపుతారు. సెక్షన్లు, మీడియంతో సంబంధం లేకుండా తరగతిని యూనిట్‌గా తీసుకుని ఎన్నికలకు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ప్రతి తరగతికి ముగ్గురేసి సభ్యుల చొప్పున గరిష్ఠంగా 23 మందిని ఎంపిక చేస్తారు. మరో ఐదుగురు కోఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. కోఆప్షన్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఈనెల 15న వరకు స్కూల్‌ అడ్మిషన్‌ రిజిస్టర్‌ లేదా ఛైల్డు ఇన్‌ఫోలో నమోదైన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రి లేదా సంరక్షకునికి ఒకరికే మాత్రమే ఓటు హక్కు కల్పించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించి అదే రోజున తొలి కమిటీ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందే అన్ని పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, మున్సిపల్‌, ఆదర్శ, కేజీబీవీలు, వసతిగృహాలకు మాత్రమే ఈ ఎన్నికలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల కాలపరిమితికి జరిగే ఈ ఎన్నికలకు తొలుత సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. సభ్యుల్లో ఒకరిని కమిటీ ఛైర్మన్‌గా, వైస్‌ఛైర్మన్లుగా సభ్యులు ఎన్నుకోవడం ద్వారా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటవుతుంది. ఎన్నికైన నాటి నుంచి రెండేళ్ల వరకు పదవిలో కొనసాగుతారు. పాఠశాలల్లో నిర్వహించే నాడు-నేడు పనులు పూర్తిగా కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. దీంతో ఈసారి కమిటీ ఎన్నికలకు కొన్ని పాఠశాలల్లో పోటీ బాగా ఉందని తెలుస్తోంది. కొందరు ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీలను కలిసి పోలింగ్‌ వేళ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరడం దీనికి నిదర్శనం. గతంలో పెదకూరపాడు మండలం గారపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు మూడుసార్లు ఎన్నిక నిర్వహణకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. మూడుసార్లు గొడవల వల్ల ఎన్నికలు జరగలేదు. అది మినహా మిగిలిన అన్ని పాఠశాలలకు ఎన్నికలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈసారి నూరుశాతం పాఠశాలలకు ఎన్నికలు జరిపించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని పాఠశాలల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించామని సమగ్రశిక్ష జిల్లా సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వెంకటప్పయ్య ‘ఈనాడు’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని