YSRCP Protest: చంద్రబాబు నివాసం వద్ద వైకాపా నేతల ఆందోళన
eenadu telugu news
Updated : 17/09/2021 14:03 IST

YSRCP Protest: చంద్రబాబు నివాసం వద్ద వైకాపా నేతల ఆందోళన

అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ సంస్మరణ సభలో తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు జోగి రమేశ్‌, వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో తెదేపా- వైకాపా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల నినాదాలతో తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో లాఠీఛార్జ్‌ చేశారు. 

వైకాపా ఆందోళన సమాచారం తెలుసుకున్న పలువురు తెదేపా నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు అక్కడికి వచ్చి వైకాపా నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న సొమ్మసిల్లిపడిపోయారు. ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారు అద్దం ధ్వంసమైంది. 

జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ: తెదేపా 

డీజీపీ దగ్గరుండి వైకాపా నేతలను చంద్రబాబు ఇంటికి పంపారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ తెదేపా నేతలపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. పోలీసులే వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారని.. పోలీసులే బుద్దా వెంకన్నను కింద పడేసి కొట్టారని ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారని బుద్దా వెంకన్న అన్నారు. అధికార పార్టీ నేతలు తమపై దౌర్జన్యం చేశారని.. దాడి చేసి కొట్టారని చెప్పారు. జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని ఆయన ఆక్షేపించారు. 

కావాలనే చంద్రబాబు ఆరోపణలు చేయించారు: జోగి రమేశ్‌

చంద్రబాబు కావాలనే జగన్‌పై ఆరోపణలు చేయించారని జోగి రమేశ్‌ ఆరోపించారు. చంద్రబాబే తనపై రాళ్లు వేయించారని.. తెదేపా కార్యకర్తలు తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. వైకాపా ఆందోళన నేపథ్యంలో జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని