కరకట్టపై ఉద్రిక్తత
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

కరకట్టపై ఉద్రిక్తత


పార్టీ జెండాలతో తెదేపా శ్రేణులపై దాడి చేస్తున్న జోగి అనుచరులు

అమరావతి కరకట్ట మార్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద శుక్రవారం వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు కరకట్టపైకి వెళ్లే మార్గాలను మూసివేశారు. చంద్రబాబు నివాసం వైపు ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు విధించారు. పెడన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌, కార్యకర్తలు మధ్యాహ్నం వాహనాల్లో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ చక్రవర్తి నేతృత్వంలో తాడేపల్లి సీఐలు, ఎస్సైలు, అదనపు బలగాలు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే తమపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తెదేపా వర్గాలు ఆందోళనకు దిగాయి.విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసానికి చేరుకోవడం మొదలుపెట్టారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పంట పొలాలు దాటుకొని చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు, ధూళిపాళ నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెనాలి శ్రావణకుమార్‌, గంజి చిరంజీవి, పోతునేని శ్రీనివాసరావు తదితరులు ఒక్కొక్కరిగా ఘటనా స్థలికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, గద్దె రామ్మోహనరావు తదితరులు వచ్చారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండించారు.

ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైకాపా కార్యకర్తలపై కేసులు పెట్టడానికి తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలు

- న్యూస్‌టుడే, తాడేపల్లి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని