ఆదరణ అంతంతే
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

ఆదరణ అంతంతే

నాన్‌-స్టాప్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌కు స్పందన కరవు

ఈనాడు, అమరావతి

ఆర్టీసీ నాన్‌-స్టాప్‌ సర్వీసులకు ఆదరణ బాగా ఉంది. చాంతాడంత వరుసల్లో నిలబడి మరీ కౌంటర్లలో టిక్కెట్లు తీసుకుంటున్నారు. కానీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ విషయానికి వచ్చేసరికి పరిస్థితి తల్లకిందులైంది. స్పందన చాలా తక్కువగా ఉంది. రోజుకు ఒకటీ అర టిక్కెట్లు మాత్రమే తీసుకుంటున్నారు. అందరూ ఆఫ్‌లైన్‌లోనే టికెట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు మంచి స్పందన వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ సదుపాయం గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.

* జిల్లా కేంద్రం మచిలీపట్నం - విజయవాడ మధ్య నడిచే నాన్‌స్టాప్‌ సర్వీసులకు ఈనెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ మార్గంలో రోజుకు ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు 30 తిరుగుతుంటాయి. వీటిల్లో ఉదయం, సాయరత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇటు విజయవాడ పీఎన్‌బీఎస్‌లో కానీ, అటు బందరులోని కౌంటర్ల వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం బారులు తీరి ఉంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి బయులుదేరే 12 బస్సులు, మచిలీపట్నం నుంచి బయలుదేరే 13 సర్వీసులకు ఈ సౌకర్యం కల్పించారు. ఆదరణ బాగుంటే ఈ రూట్లోని మిగిలిన సర్వీసుల్లోనూ దశలవారీగా తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు.

* విజయవాడ రీజియన్‌లో తిరిగే అన్ని రూట్లలోకెల్లా మచిలీపట్నం - విజయవాడ మార్గంలో ఎక్కువ మంది తిరుగుతుంటారు. 72 కి.మీ మార్గంలో ఓఆర్‌ 70 శాతం ఉంటోంది. రోజూ ఈ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, తదితరులు ప్రయాణిస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సమయం క్యూలో నిలబడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ తీసుకొచ్చారు. దీనిని ఈ నాలుగు రోజుల్లో నలుగురు మాత్రమే ఉపయోగించుకున్నారు.

* విజయవాడ - మచిలీపట్నం రూట్‌లో ప్రయోగం విజయవంతమైతే జిల్లాలోని మిగిలిన చోట్ల కూడా ప్రవేశపెట్టాలని తలపోస్తున్నారు. 48 కి.మీ దూరం ఉండే విజయవాడ - గుడివాడ మార్గంలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఓఆర్‌ 75 శాతం నమోదు అవుతోంది. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు 21 నడుస్తున్నాయి. విజయవాడ- నూజివీడు రూట్‌లో ప్రస్తుతం 8 బస్సులు తిరుగుతున్నాయి. ఈ సర్వీసుల్లో ఓఆర్‌ 61 శాతం ఉంటోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌పై ప్రయాణికుల్లోకి మరింతగా తీసుకెళ్లాలి. దీని గురించి ప్రచారం పెంచితేనే ఫలితం ఉంటుంది. తనకు నచ్చిన సర్వీసుకు, సమయానికి టికెట్‌ రిజర్వు చేసుకుంటారు. కొవిడ్‌ వేళ ఒకేచోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా, టికెట్‌ కోసం కౌంటర్ల వద్ద ఎగబడకుండా సాఫీగా ప్రయాణానికి తోడ్పడుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని