17 కేంద్రాలల్లో... ఓట్ల లెక్కింపు
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

17 కేంద్రాలల్లో... ఓట్ల లెక్కింపు

జిల్లా పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 19న ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గత ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. న్యాయస్థానంలో వ్యాజ్యం వల్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. ఈ నెల 19న ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 41 జడ్పీటీసీ స్థానాలకు, 648 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికిగాను జిల్లాలో మొత్తం 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే 16 నియోజకవర్గాలకు 17 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 41 జడ్పీటీసీ స్థానాల్లో 159 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 648 ఎంపీటీసీ స్థానాలకు 1631 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 11,883 బ్యాలెట్‌ బాక్సులు వినియోగించారు. బందరు, పెనమలూరు, జగ్గయ్యపేట మండలాల్లోని కొన్ని పంచాయతీలు పురపాలక సంఘాల్లో విలీనం కావడం వల్ల ప్రాదేశిక ఎన్నికలు నిలిపివేశారు. విస్సన్నపేటలో బీఎస్పీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు, జి.కొండూరులో కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన ఇసాక్‌, పెడనలో కాంగ్రెస్‌ అభ్యర్థి కట్టా నాంచారయ్య వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో ఈ మూడు మండలాలకు జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఐదుగురు తెదేపా, ఒకరు సీపీఎం అభ్యర్థి ఉన్నారు. పర్రాచివర స్థానానికి చెందిన తెదేపా అభ్యర్థి తాతాసాంబశివరావు, ముదినేపల్లి2కు చెందిన మంగినేని వెంకట సీతారామాంజనేయులు, వనుదుర్రుకు చెందిన సీపీఎం అభ్యర్థి చిన్నం వెంకటేశ్వరరావు, అల్లాపురానికి చెందిన తెదేపా అభ్యర్థిని దియ్యల లక్ష్మి, కొనకంచికి చెందిన నెట్టెం వెంకటరామారావు, దేవరగుంటకు చెందిన తాలం రాంబాబు మృతి చెందారు. ఈ స్థానాలకు ఎన్నికలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెదేపా పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు నాడు ప్రకటించింది. కొన్నిచోట్ల మాత్రమే తెదేపా అభ్యర్థులు ప్రచారం చేశారు. జిల్లాలో 63 శాతం పోలింగ్‌ జరిగింది. ప్రసాగదంపాడులో 19.7శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం..

జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు ఓట్ల లెక్కింపు కొవిడ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్‌ టీకాలు తీసుకుని ఉండాలి. లెక్కింపు కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమలులో ఉంటుంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కించి తదుపరి జడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ ఏర్పాట్లపై శక్రవారం కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


పటిష్ఠ బందోబస్తు

విజయోత్సవ ప్రదర్శనలకు అనుమతి నిరాకరణ

నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు

జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. దీనికి నగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు అడ్డంకులు తొలగిపోవడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఘర్షణలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సెగ్మంట్లలో పోలింగ్‌ జరిగింది. బ్యాలెట్‌ పెట్టెలను మాంటిస్సోరి మహిళా కళాశాల, ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, గన్నవరంలోని సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌, ఇబ్రహీంపట్నం స్టేషన్‌ పరిధిలోని నోవా ఇంజినీరింగ్‌ కాలేజి, కంకిపాడులోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. ● ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉద్రిక్తతలకు తావులేకుండా లెక్కింపు కేంద్రాల వద్ద, విజయవాడ నగరంలో 19న 144 సెక్షన్‌ విధించారు. ఒకేచోట ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడదని నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు చెప్పారు.

* ఓట్ల లెక్కింపునకు ఆటంకాలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కానీ, ఆ పార్టీ తరఫున కానీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. సెక్షన్‌ 30, 1861 పోలీసు యాక్టు అమలులో ఉన్నందున ఊరేగింపులు, బాణసంచా కాల్చడానికి అనుమతి నిరాకరించారు.

* లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు నాలుగు అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీలు 10 మంది, ఇన్‌స్పెక్టర్లు 10 మంది, ఎస్సైలు 52 మంది, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 143 మంది, కానిస్టేబుళ్లు 302, హోంగార్డులు 108, ఆర్మ్‌డ్‌ రిజర్వు నుంచి 80 మంది, సీఎస్‌డబ్ల్యూ .. 68, ట్రాఫిక్‌ నుంచి 84 మంది చొప్పున మొత్తం 857 మంది బందోబస్తు విధుల్లో పాలుపంచుకుంటున్నారు.

- ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని