విజయవాడ కార్పొరేషన్‌ పీఆర్వోపై కేసు నమోదు
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

విజయవాడ కార్పొరేషన్‌ పీఆర్వోపై కేసు నమోదు

ఇంటి స్థలం విక్రయంలో రూ. 30 లక్షల మోసం

విద్యాధరపురం(విజయవాడ), న్యూస్‌టుడే : ఇల్లు, స్థలం విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరించి రూ.30 లక్షలు మోసం చేశారన్న ఆరోపణలపై విజయవాడ నగర పాలక సంస్థ పౌరసంబంధాల అధికారి బొమ్మళ్ల శ్రీనివాసరావుపై వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని కొత్తపేటకు చెందిన భోగవల్లి మురళీ కృష్ణ చైతన్యకు గవర్నరుపేట పరిధిలోని అప్సర థియేటర్‌ సమీపంలో 639 చదరపు గజాల స్థలంలో పాత ఇల్లు ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పెరుమాళ్ల కాశీరావు సమీప బంధువు అశోక్‌ సహకారంతో మురళీకృష్ణ చైతన్య ఇంటిని కొనేందుకు నిర్ణయించుకున్నారు. ఈ స్థలం విక్రయంలో కార్పొరేషను పీఆర్వో బొమ్మళ్ల శ్రీనివాసరావు మధ్యవర్తిగా ఉన్నాడు. స్థలాన్ని రూ.1.50 కోట్లకు విక్రయించేందుకు మురళీకృష్ణచైతన్య అంగీకరించాడని, అందుకు రూ. 30 లక్షలు చెల్లిస్తే అగ్రిమెంట్‌ రాస్తాడని శ్రీనివాసరావు చెప్పాడు. అది నమ్మి డబ్బులు ఇచ్చినట్లు కాశీరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం యజమాని మురళీకృష్ణ చైతన్యకు బయనాగా ఇవ్వమని ఇచ్చిన రూ.30 లక్షలు పీఆర్వో శ్రీనివాసరావు ఇవ్వలేదన్నారు. దీంతో స్థల యజమాని రిజిస్ట్రేషను చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. బయానా పేరుతో, ఇంటిపై రూ. 95 లక్షల రుణం ఉన్నట్లు తమకు చెప్పకుండా పీఆర్వో శ్రీనివాసరావు మోసం చేసినట్లు కాశీరావు పేర్కొన్నారు. పీఆర్వోపై ఐపీసీ 506తో పాటు 406, 409, 420 సెక్షన్ల కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్సై రఘునాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని నుంచి బ్రోకరేజి కింద రూ. 4 లక్షలు తీసుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని