ఓట్ల లెక్కింపులో అప్రమత్తం
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

ఓట్ల లెక్కింపులో అప్రమత్తం

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌, చిత్రంలో జేసీలు మాధవీలత, మోహన్‌కుమార్‌ తదితరులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఓట్ల లెక్కింపుపై సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, రిటర్నింగ్‌ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులు కౌంటింగ్‌ హాలుకు తీసుకురావడం నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకూ ప్రతి అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మండలానికి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉంటే అన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో స్టేషనరీ, బాల్‌పాయింట్‌ పెన్నులు, పేపర్లు, రబ్బర్‌ బ్యాండ్లు తదితర సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించాలని, సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6గంటలకే సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఏజెంట్ల నియామకానికి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం అందించి శనివారం నాటికి అర్హులైన వారికి పాస్‌లు జారీ చేయాలన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్‌ వేసుకున్న వారు ధ్రువపత్రాలను తీసుకురావాలని, వేసుకోని వారిని ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్స్‌ ద్వారా కొవిడ్‌ టెస్టు చేసుకున్నాక రిపోర్టు పరిశీలించి కేంద్రంలోనికి అనుమతించాలని స్పష్టం చేశారు. జేసీలు డాక్టర్‌ కె.మాధవీలత, కె.మోహనకుమార్‌, విజయవాడ సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, జడ్పీ సీఈవో పీఎస్‌ సూర్యప్రకాశరావు, డీపీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

క్లస్టర్‌ సూపర్‌వైజర్ల నియామకం

కృష్ణలంక, న్యూస్‌టుడే: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహించేందుకు పర్యవేక్షణ కోసం జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌లను క్లస్టర్‌గా విభజించి సూపర్‌వైజర్లను నియమిస్తూ కలెక్టర్‌ జె.నివాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్‌ మండలాలకు జేసీ(రెవెన్యూ) కె.మాధవీలత, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ మండలాలకు జేసెీ(సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, విసన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, నూజివీడు, అగిరిపల్లి, ముసునూరు మండలాలకు నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్షి, గుడివాడ, పామర్రు, గుడ్లవల్లేరు, నందివాడ, ముదినేపల్లి, పెదపారుపూడి, కైకలూరు, కలిదిండి, మండవల్లి, పెడన, గూడూరు, బంటుమిలి, కృత్తివెన్ను మండలాలకు మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలిని క్లస్టర్‌ సూపర్‌వైజర్లగా నియమించారు.

మద్యం దుకాణాల మూసివేత

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను చేపట్టనున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అనుసరించి 19 తేదీన జిల్లాలో మద్యం దుకాణాలను మూసివేయాలని, మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.


విజయోత్సవ ప్రదర్శనలకు అనుమతి లేదు: ఎస్పీ


కౌంటింగ్‌ ఏర్పాటుపై డీఎస్పీ నాగేశ్వరరెడ్డితో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ప్రదర్శనలు చేసేందుకు అనుమతి లేదని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పష్టం చేశారు. స్థానిక మార్కెట్‌ యార్డులోని కంచికచర్ల, వీరులపాడు మండలాల స్ట్రాంగ్‌ రూమ్‌ని శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. లెక్కింపు రోజున కొవిడ్‌ నిబంధనలు పాటించేలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలని సూచించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డితో భద్రత పరంగా తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. మహిళ పోలీసులతో సమావేశం నిర్వహించారు. సీఐ నాగేంద్రకుమార్‌, ఎస్‌ఈబీ సీఐ సుధాకర్‌, ఎస్సైలు సుబ్రహ్మణ్యం, లక్ష్మీసోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని