‘ఓర్వలేకే చంద్రబాబు ఇంటిపై దాడి’
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

‘ఓర్వలేకే చంద్రబాబు ఇంటిపై దాడి’

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘రైతుకోసం-తెలుగుదేశం’ కార్యక్రమానికి అన్నదాతల నుంచి వస్తోన్న విశేష స్పందన చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి ఉసిగొల్పారని నరసరావుపేట పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పోలీసుల అలుసుతోనే ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. పరిపాలన చేతగాక జగన్‌ ఈ తరహా పనులు చేయమని వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వబోమని రమేష్‌ చేసిన హెచ్చరిక వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దల కుట్ర ఉంది. దౌర్జన్యానికి ఒడిగట్టిన జోగి రమేష్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’.. అని డిమాండ్‌ చేశారు. గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు వైకాపా కేంద్రాలుగా మారిపోయాయన్నారు. జగన్‌ అసమర్థ పాలన వల్లే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి రాజామాస్టర్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు శివప్రసాద్‌, ధారూనాయక్‌, శ్రీనివాసరావు, శివరామయ్య, ఓంకార్‌, హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని