ఫలితాల వేళ.. పటిష్ఠ బందోబస్తు
eenadu telugu news
Updated : 18/09/2021 11:31 IST

ఫలితాల వేళ.. పటిష్ఠ బందోబస్తు

ఈనాడు, అమరావతి, గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే

 

నేటి రాత్రి నుంచే గ్రామాల్లో పహారా

పల్నాడులో ప్రత్యేక బలగాల మోహరింపు

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఫలితాల ప్రకటన వేళ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు పోలీసు పికెట్లు పెట్టాలని జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఏమాత్రం ఘర్షణలు చోటుచేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టేందుకు గుంటూరు అర్బన్‌, రూరల్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఫలితాలు ప్రకటించే సమయంలో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఇద్దరు ఎస్పీలు భావించారు. దీంతో ఎక్కడైతే గొడవలకు ఆస్కారం ఉంటుందో ఆ గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచే పోలీసు పికెట్లు ఏర్పాట్లు చేసుకుని ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అలజడులు లేకుండా ప్రశాంతంగా ఆ ప్రక్రియ నిర్వహించేందుకు ఆయా కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను కేటాయించనున్నారు. జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం ఉదయం నుంచే పోలీసు సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

పల్నాడులో ప్రత్యేక బలగాలు.. ఏఆర్‌, ఏపీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలను మూడు పార్టీలను నరసరావుపేట, గురజాల కేంద్రాల్లో మోహరింపజేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి పల్నాడులో ఎక్కడ గొడవలు జరిగినా ఈ బృందాలు వెంటనే ఆయా గ్రామాలకు చేరుకుని ఘర్షణలను నిలువరిస్తాయని పోలీసు వర్గాలు తెలిపాయి. నామినేషన్ల పర్వంలోనే పల్నాడులోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఫలితాల వేళ బాగా అల్లర్లు జరిగే ఆవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తమైన ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం ఆయా సబ్‌డివిజన్ల అధికారుల సమీక్షలో వెంటనే గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని, గొడవలకు పాల్పడతారని భావించేవారిని స్టేషన్లకు తీసుకొచ్చి కూర్చొబెట్టాలని, కౌంటింగ్‌ అనంతరం వారిని విడుదల చేయాలని స్పష్టం చేశారు. డెల్టా ప్రాంతంలోనూ పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని, ఆయా ప్రాంతాల ఇన్‌స్పెక్టర్లు శనివారం నుంచి సోమవారం దాకా గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోనే ఎక్కువ గొడవలు జరగడానికి ఆస్కారం ఉందని నిఘా వర్గాల సమాచారం. కౌంటింగ్‌ ముగిసే వరకు పోలీసులకు సెలవులు రద్దు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో కనీసం ఊరేగింపులకు తావు లేకుండా చూడాలని, ఎవరైనా నిబంధనలు ధిక్కరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బాణసంచా కాల్చడం, ర్యాలీలు వంటివి నిషిద్ధమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించటానికి, ఫలితాల వేళ గ్రామాల్లో అలజడులు లేకుండా ఉండటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆయా గ్రామాలు పూర్తిగా పోలీసు పర్యవేక్షణలో ఉండేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ‘సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో విజేతలను ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో ఆ గ్రామాల్లో కనీసం ర్యాలీలు కూడా లేకుండా’ చూస్తామన్నారు. 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఎవరైనా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే సమీపంలోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని’ ప్రజలకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని