సన్నద్ధం
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

సన్నద్ధం


మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈనెల 19న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనరు గిరిజాశంకర్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌, గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ, జిల్లా సంయుక్త కలెక్టర్లు, జిల్లా అధికారులు వీసీకి హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని, ఓట్ల లెక్కింపు వచ్చే అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు కూడా విధిగా కరోనా రెండు డోసులు వేయించుకుని నెగటివ్‌ రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశారు. సీఎస్‌ వీసీ అనంతరం జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌ జిల్లా అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144వ సెక్షన్‌ని విధించడంతో పాటు జన సంచారం లేకుండా చూడాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. పోలీస్‌ శాఖకు సంబంధించి ఇద్దరు ఎస్పీలు వారి పరిధిలో శాంతి భద్రతల సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకోనున్నారు.

14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. జిల్లాలో 14 కేంద్రాల్లో 47 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని కోసం సమన్వయకర్తలను నియమించారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌కు సంయుక్త కలెక్టర్‌ని ప్రత్యేక అధికారులుగా నియమించారు. పోలైన ఓట్లను అనుసరించి కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా వీడియో కెమెరాలతో ఓట్ల లెక్కింపును రికార్డు చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 2,400 మంది సిబ్బందిని నియమించారు. వీరికి శనివారం మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చిన తర్వాత కౌంటింగ్‌ విధులకు పంపుతారు. జిల్లాపరిషత్తు సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎంపీడీవోలతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని